టాప్‌–3 లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

టాప్‌–3 లక్ష్యం

Feb 12 2026 7:02 AM | Updated on Feb 12 2026 7:02 AM

టాప్‌–3 లక్ష్యం

టాప్‌–3 లక్ష్యం

● మురికివాడల అభివృద్ధే లక్ష్యం ● బీచ్‌రోడ్డులో 6 సులభ్‌ కాంప్లెక్స్‌లు ● జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ వెల్లడి

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో

డాబాగార్డెన్స్‌: నగరంలో మురికివాడల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, రోడ్ల విస్తరణ, జంక్షన్ల సుందరీకరణ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బుధవారం తన చాంబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నగర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో

తొలి మూడు ర్యాంకుల్లో..

గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖ 9వ ర్యాంకు సాధించిందని, ఈసారి మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచేలా కృషి చేస్తున్నామని కమిషనర్‌ తెలిపారు. పారిశుధ్యం, వ్యర్థాల సేకరణ, తరలింపు ప్రక్రియలను నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. త్వరలో కేంద్ర బృందం పర్యటించనున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం ఆర్కే బీచ్‌ నుంచి రుషికొండ వరకు 6 ప్రాంతాల్లో కొత్తగా సులభ్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

మహిళా హాస్టళ్ల నిర్మాణం

ఉద్యోగినుల (వర్కింగ్‌ వుమెన్స్‌) కోసం మధురవాడ జోన్‌–5లోని బుట్టవానిపాలెం లేవుట్‌లో రూ.26.12 కోట్లతో చేపట్టనున్న హాస్టల్‌ పనులకు ఇటీవలే భూమిపూజ చేశామన్నారు. అలాగే గాజువాక, ముడసర్లోవలో హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఇవి జీ+4 అంతస్తులతో, 96 గదులు, 248 మంది నివసించే సామర్థ్యంతో ఆధునిక వసతులతో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

ఐఎఫ్‌ఆర్‌ పనులు, ట్రాఫిక్‌ నియంత్రణ

నగరంలో జరగనున్న ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) దృష్ట్యా రూ.18.5 కోట్లతో 119 అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో 90 శాతం శాశ్వత పనులేనని స్పష్టం చేశారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు బీచ్‌రోడ్‌లోని సెంట్రల్‌ మీడియన్‌, పారిశుధ్యం, నగర సుందరీకరణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కోసం రూ.14.29 కోట్లతో వేపగుంట–పినగాడి, రూ.11.5 కోట్లతో వేపగుంట–జుత్తాడ రోడ్ల పనులు ప్రారంభించామన్నారు.

ఆదాయం, జోన్ల పునర్విభజన

జీవీఎంసీ పరిపాలన సౌలభ్యం కోసం జోన్లను 8 నుంచి 10కి పెంచినట్లు తెలిపారు. పన్నుల వసూలులో ఈ ఏడాది రూ.1,200 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నగరంలోని 21 ప్రాంతాల్లో వెండర్స్‌ జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రస్తుతం 3 ప్రాంతాలను తుది ఎంపిక చేశామన్నారు. వీటిని జీవీఎంసీ, మెప్మా, లబ్ధిదారులతో కలిసి ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ఆపరేషన్‌ 3.0 కింద సెల్లార్‌ ఆక్రమణలు తొలగిస్తున్నామని, ఆర్కే బీచ్‌, భీమిలి వై జంక్షన్‌, పోతినమల్లయ్యపాలెం వద్ద మల్టీ లెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ వివరించారు.

పైలట్‌ ప్రాజెక్టుగా వెలంపేట, ఇందిరానగర్‌

నగరంలోని మురికివాడల అభివృద్ధిలో భాగంగా పైలట్‌ ప్రాజెక్టు కింద పాతనగరంలోని వెలంపేట, శ్రీకన్య థియేటర్‌ సమీపంలోని ఇందిరానగర్‌ను ఎంపిక చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. వెలంపేటలో 59 సెంట్ల స్థలంలో పీపీపీ పద్ధతిలో రూ.23.17 కోట్లతో జీ+11 అంతస్తుల సముదాయాన్ని నిర్మించి, 177 మంది లబ్ధిదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో కేంద్రం వాటా రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.లక్ష ఉంటుందని, జీవీఎంసీ తరఫున రూ.8.85 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ పనులు మార్చిలో ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అలాగే ఇందిరానగర్‌లో జీ+6 పద్ధతిలో 110 మందికి గృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement