టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై కలెక్టర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై కలెక్టర్‌ ఆగ్రహం

Feb 10 2026 8:12 AM | Updated on Feb 10 2026 8:12 AM

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై కలెక్టర్‌ ఆగ్రహం

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై కలెక్టర్‌ ఆగ్రహం

● టీపీవోకు చార్జీ మెమో ● వైఖరి మార్పులేకపోతే చర్యలు ● పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ హెచ్చరిక

మహారాణిపేట: ప్రజా వినతుల పరిష్కారంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అనుసరిస్తున్న తీరుపై కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. 25 శాతం కంటే ఎక్కువ పెండింగ్‌ ఉన్న అధికారులకు మెమోలు జారీ చేయాలని, ముఖ్యంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన టీపీవో–6కు చార్జ్‌ మెమో ఇవ్వాలని నోడల్‌ అధికారిని ఆదేశించారు. టౌన్‌ ప్లానింగ్‌ పనితీరును తానే స్వయంగా నెల రోజుల పాటు పరిశీలిస్తానని, ఈ లోగా మార్పు రాకపోతే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల కోసం కలెక్టరేట్‌ వరకు రాకుండా క్షేత్రస్థాయిలోనే పరిష్కారం లభించేలా అధికారులు పనిచేయాలని, ఎస్‌.ఎల్‌.ఎ కాలపరిమితి దాటకుండా వినతులను పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, సరైన ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్‌చార్జి డీఆర్వో సత్తిబాబు, అడిషనల్‌ కమిషనర్‌ సత్యవేణి తదితరులు ప్రజల నుంచి మొత్తం 383 వినతులను స్వీకరించారు. వీటిలో జీవీఎంసీకి సంబంధించి 106, రెవెన్యూ విభాగంపై 94, పోలీసు శాఖకు 25, ఇతర విభాగాలకు చెందిన 158 వినతులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement