శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
డాబాగార్డెన్స్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. శివరాత్రి జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే భక్తుల కోసం ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. మంగళవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీని బట్టి అధికారుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. జీరో బ్రేక్ డౌన్స్ సాధించాలని, కాలుష్యం లేకుండా బస్సుల నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గంగాధరరావు, ఏటీఎం కె.గంగాధరరావు, పర్సనల్ ఆఫీసర్ జె.తిరుపతి, అకౌంట్స్ ఆఫీసర్ వి.వంశీమోహన్, అన్ని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
ప్రత్యేక బస్సులు ఇలా..
● గాజువాక, కూర్మన్నపాలెం, అగనంపూడి ప్రాంతాల నుంచి అప్పికొండకు 94 ప్రత్యేక బస్సులు, తగరపువలస, భీమిలి, ఆరిలోవ కాలనీ, రవీంద్రనగర్, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం, గాజువాక, కూర్మన్నపాలెం నుంచి ఆర్.కె. బీచ్‌కు 110 బస్సులు, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మత్స్యగుండంకు 15 బస్సులు, కల్యాణపులోవకు 5 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.


