వాచ్‌మన్ అనుమానాస్పద మృతి
పందుల ఫారంలో పనిచేస్తున్న తూ.గో.వాసి
ఆనందపురం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. ఆనందపురం పంచాయతీ శివారులో మధురవాడకు చెందిన ఓ వ్యక్తి నిర్వహిస్తున్న పందుల పెంపక కేంద్రంలో.. శివ (38) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కొండగుంటూరుకు చెందిన శివ, తన భార్యతో కలిసి గత ఆరు నెలలుగా ఈ పందుల ఫారంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. శివ మృతదేహాన్ని గమనించిన స్థానికులు 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో, దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసునాయుడు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


