స్టీల్‌ప్లాంట్ పర్సనల్ డైరెక్టర్ బాధ్యతల స్వీకరణ
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (పర్సనల్)గా డాక్టర్ రాకేష్ నందన్ సహాయ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఈ బాధ్యతలు నిర్వహించిన ఎస్.సి.పాండే పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో సహాయ్ బాధ్యతలు చేపట్టారు. హెచ్‌ఆర్‌లో 29 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సహాయ్ పవర్, మైనింగ్, రిన్యూవబుల్ ఎనర్జీ, రీసెర్చ్ తదితర సెక్టార్లలో స్ట్రాటజిక్ హెచ్‌ఆర్, ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్, చేంజ్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ తదితర కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇంతకు ముందు ఆయన ఎన్టీపీసీలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన సహాయ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేశారు.
ప్రతి మూడు నెలలకు స్కానింగ్ కేంద్రాల తనిఖీలు
మహారాణిపేట: ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీవో) ఎస్. సుధాసాగర్ ఆదేశించారు. మంగళవారం ఆర్‌డీవో కార్యాలయంలో నిర్వహించిన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీసీపీఎన్‌డీటీ) అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. స్కానింగ్ కేంద్రాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇవ్వాలని, డికాయ్ ఆపరేషన్లు కొనసాగించాలని తెలిపారు. ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టవిరుద్ధమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తనిఖీల సమయంలో స్కానింగ్ కేంద్రాల్లోని రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మహిళా ఆరోగ్య అధికారి డాక్టర్ ఎన్.వి.సమత, విక్టోరియా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషాప్రసాద్‌తో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.


