రాయపుర అగ్రహారంలో భూసేకరణ సెగ
సబ్బవరం: మండలంలోని రాయపుర అగ్రహారంలో ముందస్తు సమాచారం లేకుండా రెవెన్యూ అధికారులు చేపట్టిన భూ సర్వే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో తమ భూములను సేకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో రైతులు కలెక్టర్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు. మూడు రోజులుగా గ్రామంలో వివిధ బృందాలుగా విడిపోయి అధికారులు సర్వే నిర్వహిస్తుండగా, దీనిపై ఎలాంటి గ్రామసభ నిర్వహించకపోవడం లేదా రైతులకు అధికారిక నోటీసులు ఇవ్వకపోవడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏపీఐఐసీ అవసరాల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపడుతున్నామని అధికారులు చెబుతుండగా, ఇక్కడి రైతులంతా పేద, వెనుకబడిన వర్గాలకు చెందినవారని, వ్యవసాయమే తమ ఏకై క జీవనాధారమని రైతులు వాపోతున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో పంటలు పండించుకుంటూ జీవిస్తున్నామని, ఇప్పటికే పోలవరం కాలువ విస్తరణలో కొంత భూమిని కోల్పోయామని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన భూములను కూడా తీసుకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా సర్వే చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శిస్తూ, తక్షణమే ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ జీవన హక్కులను కాలరాస్తోందని, ఒకవేళ సర్వే కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రైతులు హెచ్చరించారు. వినతిపత్రం అందజేసినవారిలో రైతులు నంబారు రాము, కోన రాముడు, భీశెట్టి వెంకటరావు, పిల్లల సోమేశ్వరరావు, పిల్లల అప్పనాయుడు, ఇసరపు వెంకటరావు, పిల్లల అప్పలనాయుడు, కోన గంగరాజు, నక్కెళ్ల అచ్చిబాబు,ిపిల్లల పరదేశి, సింగంపల్లి సన్యాసిరావు, అధిక సంఖ్యలో రైతులు ఉన్నారు.


