బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతం
విశాఖ లీగల్ : రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 2020 తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొనగా, మొత్తం 82.2 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో ఓటు హక్కు కలిగిన 3,513 మంది న్యాయవాదులకు గాను 2,888 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39,400 మంది ఓటర్లు ఉండగా, 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. న్యాయవాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి, విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతీ నాయుడు తెలిపారు. ఓటింగ్ ప్రక్రియను విజయవంతం చేసిన న్యాయవాదులందరికీ వారు ధన్యవాదాలు తెలియజేశారు.


