విక్టోరియా ఆస్పత్రికి ఐఎస్‌వో గుర్తింపు
మహారాణిపేట: పేద ప్రజలకు ప్రసూతి సేవలందిస్తున్న ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రికి ఐఎస్‌వో సర్టిఫికెట్ లభించింది. మంగళవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సమక్షంలో హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రతినిధి శివయ్య.. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.ఉషా ప్రసాద్‌కు ఈ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఇటీవల ఐఎస్‌వో అధికారుల బృందం ఆస్పత్రిలో విస్తృతంగా పర్యటించింది. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను వారు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నిశితంగా పరిశీలించారు. రోగుల భద్రత, సేవల నాణ్యత, ఆస్పత్రి నిర్వహణ విధానాలు, రికార్డుల నిర్వహణ, మౌలిక వసతులు, సేవల అమలులో ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి ఐఎస్‌వో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు బృందం నిర్ధారించింది. ఇందులో భాగంగా ఆస్పత్రికి ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. భవిష్యత్తులోనూ రోగులకు నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.


