నేడే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు
విశాఖ లీగల్: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఈ ఎన్నికల కోసం విశాఖలో అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వ తీ నాయుడు తెలిపారు. 2020 తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో న్యాయవాదుల్లో ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయవాది పర్యవేక్షణలో జరగనున్న ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలోని 2,000 మందికి పైగా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 143 మంది పోటీ చేస్తుండగా, ఒక్క విశాఖ నగరం నుంచే 24 మంది బరిలో నిలవడం విశేషం. మిగిలిన జిల్లాల అభ్యర్థులు కూడా విశాఖ ఓటర్లపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఎన్నికల ద్వారా బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తదితర కీలక పదవులను ఎన్నుకోనున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో ప్రతి న్యాయవాది కనీసం ఐదు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఓటును అంకెల రూపంలో కాకుండా, అక్షర రూపంలో రాయాలి. ఓటు వేయడానికి వచ్చే న్యాయవాదులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన ఐడీ కార్డు లేదా విశాఖ న్యాయవాద సంఘం ఐడీ కార్డును తప్పనిసరిగా చూపించాలి. అర్హులైన న్యాయవాదులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బార్ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షులు కె. రామజోగేశ్వరరావు, ఎస్.కృష్ణమోహన్, ఇతర సభ్యులు కోరారు.
బరిలో విశాఖ నుంచి
24 మంది న్యాయవాదులు


