విశాఖ మెట్రోకు లైన్ క్లియర్!
సాక్షి, విశాఖపట్నం: ఎట్టకేలకు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సుమారు రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో, రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయిన సందర్భంగా.. స్వల్ప మార్పులతో కూడిన మెట్రో డీపీఆర్‌ను ఆమోదించేందుకు మంత్రి సమ్మతించారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. అనంతరం.. హోం, రక్షణ శాఖలతో సహా మొత్తం 12 మంత్రిత్వ శాఖల నుంచి అభ్యంతరాలు లేదా అభిప్రాయాలను సేకరించనున్నారు. ఆ తర్వాత నలుగురు కేంద్ర కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగే పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు సమావేశంలో ప్రాజెక్టుకు తుది ఆమోదముద్ర వేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.
డీపీఆర్‌పై మల్లగుల్లాలు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌ను పక్కనబెట్టి, ప్రస్తుత ప్రభుత్వం అందులో పలు మార్పులు చేర్పు లు చేసింది. తొలుత పాత నివేదికను, కొత్త డీపీఆర్‌ను సరిపోల్చిన కేంద్రం.. పాత నివేదికే బాగుందంటూ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయి తే, కొత్త డీపీఆర్‌నే ఆమోదించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టడంతో, ఎట్టకేలకు సవరించిన ప్రతిపాదనలకే కేంద్రం ఓకే చెప్పినట్లు సమాచారం.
టెండర్లకు మోక్షమెప్పుడో?
మరోవైపు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం గతేడాది జూలై 25న టెండర్లను ఆహ్వానించింది. ఫేజ్–1లో భాగంగా 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్ల పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్‌సీ టెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందుకోసం రూ.6,250 కోట్లు (జీఎస్టీ అదనం) వ్యయం అవుతుందని అంచనా. అయితే డీపీఆర్ ఆమోదం లేకుండా టెండర్లలో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొనడంతో నిర్మాణ సంస్థలేవీ తొలుత ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి, నిబంధనలలో కొంత వెసులుబాటు కల్పించింది. గత అక్టోబర్‌లో టెండర్ల గడువు ముగియగా, రెండు మూడు సంస్థలు మాత్రమే బిడ్లను దాఖలు చేశాయి. అయితే, డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాతే టెండర్లను తెరవాల్సి ఉండటంతో ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కేంద్ర మంత్రితో భేటీలో డీపీఆర్ ఆమోద అంశం కొలిక్కి రావడంతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఊపిరి పీల్చుకుంది. డీపీఆర్ అధికారికంగా అప్రూవ్ అయిన వెంటనే టెండర్ల ప్రక్రియ ముందుకు సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
డీపీఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రూ.11 వేల కోట్లతో రెండు దశల్లో
నిర్మాణానికి అంగీకారం
త్వరలో అధికారిక ఉత్తర్వులు
వెలువడే అవకాశం
విశాఖపట్నం మెట్రో రైల్–ఫేజ్ 1 వివరాలివి..
కారిడార్ మార్గం పొడవు స్టేషన్ల
(కి.మీలలో) సంఖ్య
కారిడార్–1 స్టీల్‌ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ 34.40 29
కారిడార్–2 గురుద్వారా నుంచి పాతపోస్ట్ ఆఫీస్ 5.07 6
కారిడార్–3 తాటిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు 6.75 7
మొత్తం 46.23 42


