మహిళ దారుణ హత్య
ఆరిలోవ: ఆరిలోవలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రెక్కీ నిర్వహించిన ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెను హత్య చేసి, బీరువాలో ఉన్న నగదు, బంగారం దోచుకుపోయాడు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఆరిలోవ సీఐ హెచ్.మల్లేశ్వరరావు, ఎస్‌ఐలు, క్లూస్ టీం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో మంచంపై నిర్జీవంగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా, ఒకే వ్యక్తి దొంగతనానికి పాల్పడి, అడ్డుగా వచ్చిన మహిళను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
వివరాల్లోకి వెళితే.. జీవీఎంసీ 12వ వార్డు పరిధిలోని దుర్గానగర్‌లో కాపు లక్ష్మి (48) తన భర్త రమణతో నివసిస్తోంది. వీరి ఇద్దరు పిల్లలకు వివాహం కావడంతో వారు వేర్వేరు చోట్ల ఉంటున్నారు. రమణ జీవీఎంసీలో ఉద్యోగి. బుధవారం ఉదయం ఆయన విధులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి చేరుకునే సరికి బయట గేటు, గుమ్మం తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లగా, భార్య లక్ష్మి మంచంపై రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మెడ, ముఖంపై గాయాలు ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించారు. ఇంటి సీసీ కెమెరాలు, సమీప ఇళ్ల కెమెరా దృశ్యాలను పరిశీలించగా, ఉదయం 10 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి, మధ్యాహ్నం 12.32 గంటలకు చేతిలో బ్యాగ్‌తో బయటకు వచ్చినట్లు గుర్తించారు. అతను స్థానిక వ్యక్తే కావచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్న చీటి డబ్బులు సుమారు రూ.5 లక్షలు, అలాగే మహిళ ధరించిన కొన్ని బంగారు ఆభరణాలు అపహరించబడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఏసీపీ నర్సింహమూర్తి వెల్లడించారు. ఇంట్లో చీటి డబ్బులు ఉన్న విషయం తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కొంతసేపు వీధిలో రెక్కీ నిర్వహించి, సమయం చూసుకుని ఇంట్లోకి ప్రవేశించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, ఇదే ప్రాంతానికి సమీపంలోని దుర్గానగర్‌లో సుమారు ఎనిమిదేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో ఓ వృద్ధురాలిని హత్య చేసి బంగారం దోచుకుపోయిన ఘటనను స్థానికులు గుర్తు చేస్తున్నారు. తాజా ఘటనతో ప్రాంతంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి.
మహిళ దారుణ హత్య
మహిళ దారుణ హత్య


