నమ్మితే.. కారు చీకట్లే! | - | Sakshi
Sakshi News home page

నమ్మితే.. కారు చీకట్లే!

Feb 11 2026 8:51 AM | Updated on Feb 11 2026 8:51 AM

నమ్మితే.. కారు చీకట్లే!

నమ్మితే.. కారు చీకట్లే!

నగరంలో విజృంభిస్తున్న

కార్స్‌ ట్రావెల్‌ మాఫియా

సామాన్యులకు అద్దె ఆశ చూపి

కార్లు మాయం చేస్తున్న వైనం

పోలీసుల కల్లుగప్పి తప్పించుకు

తిరుగుతున్న నిర్వాహకులు

ఎంవీపీకాలనీ: మీ ఇంట్లో కారు ఖాళీగా ఉంటోందా? దాన్ని అద్దెకు ఇస్తే ఈఎంఐలు, ఇతర ఖర్చులకు డబ్బులు వస్తాయని ఎవరైనా ట్రావెల్‌ ఏజెంట్లు మిమ్మల్ని సంప్రదిస్తున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త! నగరంలో కార్‌ ట్రావెల్‌ మాఫియా విజృంభిస్తోంది. అమాయక కారు యజమానులకు అద్దె ఆశ చూపి, ఆపై కార్లను మాయం చేస్తూ కోట్లలో దండుకుంటోంది. ప్రస్తుతం ఈ తరహా కేసులు నగరంలో పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి.

మోసం తీరు ఇలా..

సామాన్యులే లక్ష్యంగా ఈ ముఠా వల విసురుతోంది. ‘మీ కారును మా ట్రావెల్స్‌లో పెట్టండి.. నెలకు వేలల్లో అద్దె చెల్లిస్తాం.. ఈఎంఐ భారం తగ్గుతుంది’అంటూ నమ్మబలుకుతారు. మొదట్లో ఒకటి, రెండు నెలలు సక్రమంగానే డబ్బులు చెల్లించి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అద్దె ఇవ్వడం మానేస్తారు. యజమాని నిలదీస్తే.. కారు అక్కడ ఉంది.. ఇక్కడ ఉంది అంటూ మభ్యపెడతారు. చివరికి కారును కూడా తిరిగి ఇవ్వకుండా మాయం చేస్తుండటంతో, బాధితులు లబోదిబోమంటున్నారు.

ఆ రెండు సంస్థలపైనే ఆరోపణలు

నగరంలో వైజాగ్‌ సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్స్‌, భవానీ సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్స్‌ అనే ఏజెన్సీలపై అత్యధిక ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై ఎంవీపీ, ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌తో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. ఈ సంస్థల నిర్వాహకు లు బాషా, వెంకటేష్‌లు కలిసి అనేక మందిని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. వీరిపై ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌లో హరీష్‌, తూర్పు గోదావరి జిల్లా నగరం పోలీస్‌స్టేషన్‌లో సత్యనారాయణ, హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో హరి అనే బాధితులు ఫిర్యాదులు చేశారు. కేసులు నమోదవుతున్నా, ఈ ముఠా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. గుంటూరు, హైదరాబాద్‌లలో ఉన్నామంటూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిత్యం ఇళ్లు, ఆఫీసులను మారుస్తూ, ఫోన్‌ లొకేషన్లకు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ పోలీసుల ఒత్తిడి పెరిగితే.. ‘కొంత సమయం ఇవ్వండి, కారు ఇచ్చేస్తాం’ అని చెప్పి మళ్లీ పరారవుతున్నారు. పోలీసుల నెట్‌వర్క్‌కు, టెక్నాలజీకి కూడా దొరక్కుండా దర్యాప్తు బృందాలకు చుక్కలు చూపిస్తున్నారు.

ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా?

బాధితులు నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు ఈ మాఫియా పట్ల కఠినంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బైండోవర్‌ రాసినా

భయం లేదు!

డిసెంబర్‌లో నా కారు విషయమై ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు అతికష్టం మీద లోకేషన్‌ ఆధారంగా వెంకటేష్‌, బాషాలను పట్టుకుని స్టేషన్‌కు రప్పించారు. కారు తిరిగిచ్చేస్తామని వారు ఎస్‌ఐ సమక్షంలో ఒప్పంద పత్రం(బైండోవర్‌) రాసిచ్చారు. 10 రోజులు గడువు అడిగి, ఇప్పుడు ఆ గడువు దాటినా కారు ఇవ్వలేదు. వారు కనిపించడం లేదు. మూడు నెలలుగా స్టేషన్‌ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా న్యాయం జరగడంలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నా కారు నాకు ఇప్పించాలి.

– హరీష్‌, బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement