కూటమి మాస్టర్‌ ప్లాన్‌ ఫెయిల్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమి మాస్టర్‌ ప్లాన్‌ ఫెయిల్‌

Feb 14 2026 10:14 AM | Updated on Feb 14 2026 10:14 AM

కూటమి మాస్టర్‌ ప్లాన్‌ ఫెయిల్‌

కూటమి మాస్టర్‌ ప్లాన్‌ ఫెయిల్‌

బెడిసి కొట్టిన చంద్రబాబు ‘కుట్ర’ ప్రణాళిక వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌పై బూటకపు ప్రకటనలని నిర్థారణ వైఎస్సార్‌సీపీ హయాంలో శాసీ్త్రయంగానే బృహత్తర ప్రణాళిక సిద్ధం

విశాఖ సిటీ : చంద్రబాబు ప్రభుత్వం ‘మాస్టర్‌ ప్లాన్‌’ బెడిసికొట్టింది. వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళికపై చేసిన ఆరోపణలు తప్పని తేటతెల్లమైంది. వైఎస్సార్‌సీపీ హయాంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిపెట్టుకుని శాసీ్త్రయంగా ‘మాస్టర్‌ ప్లాన్‌–2041’ సిద్ధం చేసినట్లు నిరూపణైంది. బృహత్తర ప్రణాళికపై బురద జల్లుతూ.. పునః పరిశీలన పేరుతో 9 నెలలుగా అభ్యంతరాలు స్వీకరిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు గత ప్లాన్‌లో లోటు పాట్ల ఒక్క అభ్యంతరం రాకపోవడమే కూటమి కుట్ర ప్రణాళికకు నిదర్శనం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, నీతి అయోగ్‌ సిఫార్సుల మేరకు మాత్రమే మాస్టర్‌ప్లాన్‌లో స్వల్ప సవరణలు చోటు చేసుకోనున్నాయి.

2021లోనే మాస్టర్‌ ప్లాన్‌ పూర్తి

నిజానికి 2011లో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టినప్పటికీ, 2019 వరకు అది అడుగు ముందుకు పడలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 17,460 అభ్యంతరాలను, సలహాలను సేకరించి, క్షేత్రస్థాయిలో అధికారులతో సంయుక్త తనిఖీలు నిర్వహించి 2021 నవంబర్‌ 8న ఈ బృహత్తర ప్రణాళికకు తుది ఆమోదం తెలిపింది. అయితే ఈ ప్లాన్‌పై అప్పట్లో కూటమి నేతలు చేసిన అశాసీ్త్రయ ఆరోపణలు ఇప్పుడు వీగిపోయాయి. మే 19 నుంచి స్వీకరించిన 3722 అభ్యంతరాల్లో మెజారిటీ ఫిర్యాదులు ఒకే అంశంపై రావడంతో వాటిని పక్కన పెట్టి, కేవలం 717 విలక్షణ అభ్యంతరాలను మాత్రమే అధికారులు వడపోశారు. ఇందులో కూడా 427 అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, మిగిలిన వాటిని తోసిపుచ్చారు. గత ప్రణాళికలో అవకతవకలు జరిగాయని నిరూపించాలని చూసిన ప్రభుత్వానికి ఈ గణాంకాలు మింగుడు పడని అంశంగా మారాయి.

మార్చి 10 వరకు అభ్యంతరాల స్వీకరణ

మార్చి 10వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ కొనసాగనుంది. వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, మార్చి 15 నాటికి సాంకేతిక నిపుణుల కమిటీకి నివేదికను పంపేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మార్చి నెలాఖరు నాటికి తుది బృహత్తర ప్రణాళిక ప్రభుత్వానికి అందుతుంది. తాజా మార్పుల్లో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రహదారులు, విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ ప్రాంతాల సరిహద్దుల గుర్తింపు వంటి అంశాలను మాత్రమే పొందుపరుస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గత ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ పటిష్టతను చాటిచెబుతున్నాయి.వాటిలో ప్రధానంగా..

రవాణా, కనెక్టివిటీ: విశాఖ పోర్ట్‌ కంటైనర్‌ టెర్మినల్‌ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వరకు సవరించిన కోస్టల్‌ కారిడార్‌ అలైన్‌మెంట్‌ను మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చారు. ● అనకాపల్లి నుంచి కొత్తవలస వరకు ప్రతిపాదిత రైల్వే లైను రైల్వే డివిజన్‌ నుంచి వచ్చిన సరిహద్దుల ప్రకారం ఖరారు చేశారు.● రాయ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ఒక ప్రధాన ప్రాంతీయ కనెక్టివిటీ కారిడార్‌గా గుర్తించి మాస్టర్‌ ప్లానన్‌లో పొందుపరిచారు.● సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడానికి విజయనగరం రూరల్‌, అనకాపల్లి, విశాఖ పరిధిలో కొత్త రోడ్లను ప్రతిపాదించారు. ● వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ సిద్ధం చేసిన 37 రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లను (ఆర్‌డీపీ) బేస్‌ డేటాలో చేర్చారు.

● పర్యావరణ పరిరక్షణ కోసం కంబాలకొండ ఎకో–సెన్సిటివ్‌ జోన్‌ సరిహద్దులను అటవీ శాఖ నివేదికల ప్రకారం అప్‌డేట్‌ చేశారు.● పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో 9.17 హెక్టార్ల విస్తీర్ణంలో 20 ప్రాంతాలలో ‘మియావాకీ’ పద్ధతిలో దట్టమైన అడవుల అభివృద్ధిని ప్రతిపాదించారు. ● చిప్పాడ అటవీ ప్రాంత సరిహద్దులను అటవీ శాఖ నిబంధనల ప్రకారం నోటిఫై చేశారు. ● సుజల స్రవంతి, పోలవరం, తారకరామ కాలువలకు సంబంధించి ఇరిగేషన్‌ శాఖ సూచనల మేరకు అలైన్‌మెంట్లను ఖరారు చేశారు. ● విజయనగరం రెవెన్యూ శాఖ ఇచ్చిన డేటా ప్రకారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సరిహద్దులను అప్‌డేట్‌ చేశారు. ● మాస్టర్‌ ప్లాన్‌ తయారీలో భాగంగా 300 ఏపీడీపీఎంఎస్‌ లేఅవుట్లు, 780 ఎల్‌ఆర్‌ఎస్‌ లేఅవుట్లు, 90 వన్‌–సెంట్‌ లేఅవుట్లను బేస్‌ డేటాలో చేర్చారు. ● మాస్టర్‌ ప్లాన్‌ 2041లో మొత్తం రోడ్ల పొడవు సుమారు 3961 కిలోమీటర్లు. అదనంగా 418.9 కిలోమీటర్ల మేర కొత్త కనెక్టివిటీ రోడ్లను ప్రతిపాదించారు.

శరవేగంగా మాస్టర్‌ప్లాన్‌ రహదారులు

ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వీఎంఆర్‌డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ తేజ్‌ భరత్‌ వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు పలు కీలక ప్రకటనలు చేశారు.

అభ్యంతరాలను పరిశీలించి, సవరించిన మాస్టర్‌ ప్లాన్‌ను మార్చిలో ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కనెక్టివిటీకి సంబంధించిన 7 ప్రధాన రహదారులను మే నాటికి పూర్తి చేస్తామన్నారు. రూ.113.61 కోట్లతో నిర్మించిన ఎన్‌ఏడీ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ఆదివారం ప్రారంభిస్తామన్నారు. కైలాసగిరిపై రూ.2.5 కోట్లతో నిర్మిస్తున్న 65 అడుగుల త్రిశూల్‌, డమరుకం ప్రాజెక్టును ఉగాది నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. విశాఖలో ఐకానిక్‌ 50 అంతస్తుల టవర్లు, వర్చువల్‌ రియాల్టీ ఎరీనా, త్రీ స్టార్‌ హోటల్‌ వంటి భారీ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో త్వరలోనే ఫైనలైజ్‌ చేస్తామని తెలిపారు. మిలాన్‌ వేడుకల దృష్ట్యా వీఎంఆర్‌డీఏ పరిధిలోని మ్యూజియాలు, పార్కులను రూ.2 కోట్లతో సుందరీకరిస్తున్నట్లు వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement