చర్చలు విఫలం.. ఉద్యమానికి సిద్ధం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ పోరుబాట పట్టారు. యూనివర్సిటీ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, గురువారం రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇకపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అతిథి అధ్యాపకుల యూనియన్ నాయకుడు డాక్టర్ ఎం.సురేష్ మీనన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించాలని, నిబంధనల ప్రకారం గంటకు రూ. 1500 చొప్పున పారితోషికం లేదా నెలకు రూ. 50,000 వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలను ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వర్సిటీ పరిధిలోని ఎమ్మెల్యేలను వారు కోరారు. నిరసనలో డాక్టర్ శేషు, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శిరీష్, మురళీ, నారాయణ, పవన్, ఫణి, దాస్, దేవదానం, మాథ్యూస్, గిరీష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏయూ గెస్ట్ ఫ్యాకల్టీ నిరసన


