ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తులు అరెస్టు
తాటిచెట్లపాలెం : ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగించిన వ్యక్తులను ఫోర్త్ టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ం లోచన్‌కుమార్ అనే వ్యక్తి తాను పోలీస్ శాఖలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నానని చెప్పుకుంటూ, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్‌ఐ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించాడు. ఈ క్రమంలో మెడికల్ పరీక్షలు, ఆరోగ్య భద్రత పేరుతో బాధితుల నుంచి మొత్తం రూ.10.80 లక్షలు వసూలు చేసి, వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేసినట్లు బాధితులు ఇటీవల ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు లోచన్‌కుమార్‌ను సోమవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
సెక్రటేరియట్‌లో ఉద్యోగినని చెప్పి మోసం
మరో కేసులో గుంటూరు జిల్లాకు చెందిన ఆరిమండ తేజ కృష్ణకమల్ అమరావతిలోని సెక్రటేరియట్‌లో గ్రూప్–1 అధికారినని చెప్పుకుంటూ, ఏపీ హైకోర్టులో తనకు పరిచయాలు ఉన్నాయని, అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని విశాఖపట్నానికి చెందిన రాజు, అప్పారావు, దేవి నుంచి సుమారు రూ.10.55 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసానికి పాల్పడిన తేజ కృష్ణకమల్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్లు వెల్లడించారు.


