కదం తొక్కిన కార్మిక లోకం
బీచ్‌రోడ్డు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసే వరకు ఎలాంటి పోరాటాలకై నా కార్మిక వర్గం సిద్ధంగా ఉందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు వేలాది మంది కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద జరిగిన బహిరంగ సభలో నర్సింగరావు మాట్లాడుతూ కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని తాకట్టు పెడుతోందని విమర్శించారు. బ్రిటిష్ కాలం నుంచే పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చారని అన్నారు. ఈ కోడ్స్ అమల్లోకి వస్తే సంఘం ఏర్పాటు చేసే హక్కు, సమ్మె హక్కు, ఎనిమిది గంటల పనిదినం, ఉద్యోగ భద్రత, సెలవులు వంటి హక్కులు దెబ్బతింటాయని తెలిపారు. ఎనిమిది గంటల పని దినాన్ని 14 గంటలకు పెంచే ప్రయత్నం జరుగుతోందని, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో శాశ్వత ఉద్యోగాలను తగ్గించే విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఏకమై సమ్మెకు పిలుపునిచ్చిందని, కోట్లాది మంది కార్మికులు పాల్గొన్నారని చెప్పారు. నగరంలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా మున్సిపల్ కమిషనర్ చెత్త బయట వేయవద్దని ప్రకటించారని, ఇది కార్మికుల ఐక్యతకు నిదర్శనమని అన్నారు. జిల్లాలో బ్యాంకులు, ఎల్‌ఐసీ, జీఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులతో పాటు ఆశా, అంగన్‌వాడీ, వీవీఓఏ, ఆర్పీ కార్మికులు కూడా పనులు నిలిపివేశారని తెలిపారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయని, పలు చోట్ల ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారని చెప్పారు. సభలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఐఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి నాగభూషణం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్‌కే ఎస్‌వీ కుమార్, జీజేఎస్ అచ్యుతరావు, తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన కార్మిక లోకం


