యథేచ్ఛగా మత్తుమందుల విక్రయం
‘మెడ్‌ప్లానెట్’ యజమానిపై కేసు నమోదు
ఎంవీపీకాలనీ: డాబాగార్డెన్స్‌లోని మెడ్‌ప్లానెట్ ఫార్మసీపై సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మత్తు మందులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో.. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో శుక్రవారం ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున మత్తుమందు ఔషధాలను సీజ్ చేశారు. ప్రధానంగా టెర్మిలైఫ్ మత్తు ఇంజక్షన్లు, అల్ప్రాజోలామ్ టాబ్లెట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫార్మసీ నుంచి 48 టెర్మిలైఫ్ ఇంజక్షన్లు, 15 అల్ప్రాజోలామ్ టాబ్లెట్ స్ట్రిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఫార్మసీ యజమానిపై డ్రగ్ కంట్రోల్ విభాగం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


