ఆరు పదుల వయసులో..
పిల్లల్లా సందడి!
గురువులను సత్కరించుకున్న
బాల్య స్నేహితులు
ఘనంగా పోర్టు హైస్కూల్ విద్యార్థుల
ఆత్మీయ సమ్మేళనం
ఆనాటి ఆ స్నేహం..
అల్లిపురం: ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం.. ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం.. ఈ నాడు ఆ హాయి లేదేల నేస్తం.. ఆ రోజులు మునుముందిక రావేమిరా.. అంటూ పోర్టు హైస్కూల్ 1983–84 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సందడి చేశారు. నాలుగు దశాబ్దాల కిందట విడిపోయిన స్నేహితులంతా ఒక్కచోట చేరడంతో ఆరు పదుల వయసులోనూ వారంతా 15 ఏళ్ల పిల్లల్లా మారిపోయారు. ఉదయం 9 గంటల నుంచి నగరంలోని ఓ హోటల్ ప్రాంగణం పాత స్నేహితుల పలకరింపులతో కోలాహలంగా మారింది.
‘ఏమే రమణమ్మ.. నువ్వు అలానే ఉన్నావే.. ఏమీ మారిపోలేదు!’, ‘ఆ నువ్వు పార్వతివేనా.. గుర్తు పట్టలేకున్నానే.. ఎలా ఉన్నావు?’, ‘బాగున్నావా.. పిల్లలు ఎంతమంది.. ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉంటున్నారు?’, ‘ఆగండే మీ సోదేనా.. నన్నూ పట్టించుకుంటారా?’, ‘అవును.. నువ్వు పూర్ణిమవే కదా.. మీకు ఎవ్వరూ కనిపించడం లేదు?...’ ఇలా ఆ హాలంతా ఉత్సాహభరితమైన మాటలతో నిండిపోయింది.
ఇంతలో ‘రండమ్మా రండి.. మీ కోసమే చూస్తున్నాం.. నేనేనండీ లింగం శ్రీనివాస్‌ని..’ అంటూ పాత మిత్రుల పలకరింపులతో ఆ ప్రాంతమంతా ఆత్మీయతలు, అనురాగాలతో పండగ వాతావరణాన్ని తలపించింది. స్నేహితులంతా కబుర్లలో మునిగిపోయిన సమయంలో.. ‘అక్కడ భారతదేశానికి ఉత్తరాన ఏమిటున్నాయి?’ అంటూ ఓ సుపరిచితమైన స్వరం వినిపించింది. వారంతా ఒక్కసారిగా అటు తిరిగి చూసి, ‘అరె.. మా సోషల్ టీచర్.. నమస్కారం మేడమ్’ అంటూ గౌరవంగా చుట్టుముట్టారు.
పోర్టు హైస్కూల్ పూర్వ విద్యార్థులు సత్యనారాయణ, లింగం శ్రీనివాస్, మరికొంత మంది కలసి అప్పటి విద్యార్థుల చిరునామాలు, ఫోన్ నంబర్లు సేకరించి అందరినీ ఒక్కటిగా చేర్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి తమకు ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయులు విజయకుమారి, పద్మావతి, వసుంధరాదేవిలతో పాటు మహిళా స్నేహితులను ఘనంగా సత్కరించుకున్నారు. ఆటలు, పాటలతో మొదలైన ఈ కలయికలో అందరూ తమ ప్రస్తుత వృత్తి, కుటుంబ నేపథ్యాలను పరిచయం చేసుకున్నారు. ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు పంచుకున్నారు. మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేసి సాయంత్రం 4 గంటల వరకు ఉత్సాహంగా గడిపారు. స్నాక్స్, టీలు తీసుకుంటూ ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలను మూటగట్టుకుని.. మళ్లీ కలుద్దామన్న ఆశతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు.
మళ్లీ ఆ రోజులు గుర్తొచ్చాయి
పదో తరగతి తర్వాత తలో దారి పట్టినా, మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, ఈ ఆదివారం నాకు ఎన్నో మధుర స్మృతులను మిగిల్చింది. ప్రస్తుతం నేను జిల్లా కోర్టులో కాపీయింగ్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను.
– ఐ.రమణమ్మ, సూపరింటెండెంట్,
కాపీయింగ్ సెక్షన్, జిల్లా కోర్టు


