ఏయూక్యాంపస్: ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకుని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.కె.బీచ్‌రోడ్డులో అవగాహన నడక నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ ర్యాలీలో గ్లకోమా నిపుణులు డాక్టర్ శివాని కొడాలి మాట్లాడారు. కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యే గ్లకోమా అని వివరించారు. ఇది కంటిలోని ఆప్టిక్ నరాలను దెబ్బతీసి శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరించారు. వ్యాధిని గుర్తించడంలో జాప్యం జరగడం వల్ల చాలా మంది చూపు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లు పెద్దవిగా ఉండటం, చూపు మసకబారడం, కళ్లు ఎర్రబడటం, నీళ్లు కారడం, వెలుతురును చూడలేక కళ్లు మూసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలని సూచించారు. సరైన అవగాహన లేకపోవడం వల్లే గ్లకోమా ప్రమాదకరంగా మారుతోందని, ఇది లక్షలాది మందిలో కోలుకోలేని దృష్టి లోపానికి దారితీస్తోందని పేర్కొన్నారు. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, నివారణ, సకాలంలో చికిత్స తీసుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. మన దేశంలో సుమారు 12 మిలియన్ల మంది గ్లకోమాతో బాధపడుతున్నారని, 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ రోగుల సంఖ్య 76 మిలియన్ల నుంచి 111.8 మిలియన్లకు పెరుగుతుందని అంచనాలు చెపుతున్నాయని వివరించారు. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.


