అల్లిపురం: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పెందుర్తి క్రైం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 13 లక్షల విలువైన 160 గ్రాముల బంగారు ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ లతా మాధురి, ఇన్‌చార్జి క్రైం ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఈ వివరాలు వెల్లడించారు.
● గత ఏడాది డిసెంబర్ 3న వేపగుంట, వరలక్ష్మీనగర్‌కు చెందిన పారిపూడి వెంకటేశ్వరరావు తన తోడల్లుడు గణేష్ మరణించాడని తెలిసి, సాయంత్రం 7 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణరాయపురం వెళ్లారు. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వచ్చి చూడగా, ఇంటి తూర్పు వైపు తలుపు తాళం విరగొట్టి ఉంది. లోపలికి వెళ్లి పరిశీలించగా, బీరువా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అందులోని సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పెందుర్తి క్రైం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
● నాయుడుతోటలోని అప్పలనరసయ్య కాలనీకి చెందిన సూరెడ్డి శ్రీనివాస్ గత ఏడాది సెప్టెంబర్ 24న తన ఇంటికి తాళం వేసి, స్వగ్రామమైన కె.కోటపాడు మండలం, పొడుగుపాలెం వెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం ఆయన తిరిగి వచ్చి చూడగా, ఇంటి ప్రధాన ద్వారం తాళం విరగొట్టి ఉండటాన్ని గమనించారు. బెడ్‌రూమ్‌లోని బీరువా తాళాలు కూడా పగులగొట్టి ఉన్నాయి. అందులో ఉన్న సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
● వేపగుంట, వరలక్ష్మీనగర్ నివాసి పప్పు ధర్మేంద్ర తన భార్య ప్రసవం నిమిత్తం ఈ ఏడాది జనవరి 13న ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లారు. ఆమె డిశ్చార్జ్ అయిన తర్వాత, వారు నేరుగా ఆరిలోవలోని అత్తగారింటికి వెళ్లారు. ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటలకు ధర్మేంద్ర తిరిగి తన ఇంటికి వచ్చి చూడగా, ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా, బెడ్‌రూమ్‌లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలోని సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు సన్‌షైడ్‌పై ఉన్న ఇత్తడి పాత్ర చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు, క్రైం డీసీపీ లతా మాధురి, ఇన్‌చార్జి క్రైం ఏసీపీ నరసింహమూర్తి పర్యవేక్షణలో వెస్ట్ సబ్ డివిజన్ క్రైం ఇన్‌స్పెక్టర్ చంద్రమౌళి, ఎస్‌ఐ డి.సూరిబాబు బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ మూడు కేసుల్లో నిందితుడు చీడికాడ మండలం మంచాల గ్రామానికి చెందిన ఆది ప్రసాద్ అలియాస్ శ్రీనుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సింహాచలం కొనేరు దరి గాంధీవీధిలో నివాసం ఉంటున్న నిందితుడి నుంచి మొత్తం రూ.13 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.


