45 కేసుల్లో 76 మంది అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

45 కేసుల్లో 76 మంది అరెస్ట్‌

Feb 28 2026 7:07 AM | Updated on Feb 28 2026 7:07 AM

45 కే

45 కేసుల్లో 76 మంది అరెస్ట్‌

అల్లిపురం: నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జనవరికి సంబంధించి వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన 45 దొంగతనం కేసులను ఛేదించి, 76 మందిని అరెస్ట్‌ చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నిందితుల నుంచి మొత్తం రూ.1,02,79,845 విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఈ వివరాలను వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో రూ. 39,79,845 విలువైన 378.02 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.08 కేజీల వెండి వస్తువులు ఉన్నాయని తెలిపారు. రూ.21,37,200 నగదుతో పాటు ద్విచక్ర వాహనాలు, రూ. 63 లక్షల విలువైన 423 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేశామన్నారు. డిటెక్ట్‌ చేసిన 45 కేసుల్లో.. 2 దోపిడీ కేసులు, 4 పగటి పూట ఇళ్ల తాళాలు పగులగొట్టిన కేసులు, 5 రాత్రి పూట ఇళ్ల దొంగతనాలు, 4 చైన్‌ స్నాచింగ్‌లు, 2 మోటార్‌ సైకిల్‌ దొంగతనాలు, 3 వైర్ల దొంగతనం, ఒక పిక్‌ పాకెటింగ్‌, 24 సాధారణ దొంగతనం కేసులు ఉన్నాయని సీపీ వివరించారు. నేరాల నియంత్రణలో భాగంగా జనవరిలో వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 364 సమావేశాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అనంతరం రికవరీ చేసిన వస్తువులను బాధితులకు సీపీ అందజేశారు. సమావేశంలో క్రైం విభాగపు డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

24 గంటల్లో చోరీ కేసు ఛేదన

పాత నేరస్తుడు వెంకటేష్‌ అరెస్ట్‌

కూర్మన్నపాలెం పరిధిలో జరిగిన దొంగతనం కేసును దువ్వాడ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అరెస్ట్‌ చేశారు. కూర్మన్నపాలెంలోని గ్లోరియా విద్యా కేంద్రం వెనుక నివసిస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రిటైర్డ్‌ జనరల్‌ మేనేజర్‌ సుగన్‌ చంద్ర గుప్తా తన భార్యతో కలిసి ఈ నెల 15న కాశీ యాత్రకు వెళ్లారు. తిరిగి 24వ తేదీన వచ్చేసరికి, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం గమనించారు. అల్మారాలోని సుమారు 300 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి నాణేలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌత్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ కల్లూరి శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. సాంకేతిక ఆధారాల సాయంతో పాత నేరస్తుడు గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన మల్లారెడ్డి వెంకటేష్‌ను గుర్తించాయి. గురువారం సాయంత్రం అగనంపూడి, మణప్పురం ఫైనాన్స్‌ పక్క రోడ్‌లో అతడిని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి 270 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు గాజువాక పరిధిలో దొంగిలించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెంకటేష్‌పై ఇప్పటికే 40కి పైగా కేసులు ఉన్నాయి. ఈ నెల 17నే బెయిల్‌ మీద బయటకు వచ్చిన అతను, వ్యసనాలకు బానిసై మళ్లీ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చోరీ సొత్తులో ఒక నెక్లెస్‌, ఒక నల్లపూసల గొలుసును జైల్లో పరిచయమైన మధురవాడకు చెందిన చుక్క ఎర్నీ రాజుకు ఇచ్చి, వాటిని తాకట్టు/అమ్మి పెట్టి డబ్బులు తీసుకురమ్మని చెప్పాడు. అతన్ని కూడా పట్టుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అత్యంత వేగంగా కేసును ఛేదించిన పోలీస్‌ అధికారులను, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

రూ.1.02 కోట్ల సొత్తు రికవరీ

45 కేసుల్లో 76 మంది అరెస్ట్‌1
1/1

45 కేసుల్లో 76 మంది అరెస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement