ఎన్నికల వేళ బెంగాల్‌లో కొత్త ట్విస్ట్‌? | West Bengal Politics Focus On Siliguri Corridor | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ బెంగాల్‌లో కొత్త ట్విస్ట్‌?

Apr 15 2026 7:21 AM | Updated on Apr 15 2026 8:33 AM

West Bengal Politics Focus On Siliguri Corridor

కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని ప్రచారం

బెంగాల్‌ ఎన్నికల్లో రాజకీయ దుమారం 

రాష్ట్ర హక్కులను కాలరాయడమే: మమత

30 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారాస్త్రంగా సిలిగురి  

సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్‌ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ సిలిగురి కారిడార్‌ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానాంశంగా మారింది. దేశ భద్రత దృష్ట్యా దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ మొదలైన ప్రచారం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దేశ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీసేందుకు, రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకే మోదీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నారు.

వ్యూహాత్మకంగా కీలకం 
భారత ప్రధాన భూభాగాన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో కలిపే అతి సన్నని మార్గం సిలిగురి కారిడార్‌. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుండే ఈ కారిడార్‌ భౌగోళికంగా చిన్నదైనా వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. దేశానికే ‘లైఫ్‌ లైన్‌’వంటిది. దీనికి ఓ వైపున నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, ఇంకోవైపు భూటాన్, చైనా సరిహద్దు ప్రాంతాలున్నాయి. కోడి తల మాదిరిగా ఉండటంతో ఈ కారిడార్‌ను ‘చికెన్‌ నెక్‌’గా పిలుస్తారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైల్వే, సైనిక సరఫరా, వాణిజ్య రవాణా తదితరాలన్నీ ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల వేళ ఈ మార్గం గనుక మూసుకుపోతే తూర్పు–ఈశాన్య ప్రాంతానికి మిగతా దేశంతో సంబంధాలే తెగిపోయే ప్రమాదముంది.

తృణమూల్‌ మండిపాటు 
సరిహద్దు ప్రాంతాల పరిరక్షణ, భద్రతపై ఇటీవల పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా సమయంలో సిలిగురిని కేంద్రపాలిత ప్రాంతం చేయవచ్చన్న వార్తలు తెరపైకొచ్చాయి. అలాగైతే ఉద్రిక్తతల వేళ ఆ ప్రాంత భద్రతపై కేంద్రానికి మెరుగైన నియంత్రణ ఉంటుందని, చైనాతో యుధ్ద పరిస్థితుల వంటివి తలెత్తితే త్వరిత నిర్ణయాలు, వ్యూహాత్మక కదలికలకు వీలుంటుందనే వాదన తెరపైకొచ్చింది. అలాంటి ప్రతిపాదనలేవీ లేవని కేంద్రం స్పష్టం చేసినా విపక్షాలు, ముఖ్యంగా తృణమూల్‌ మాత్రం దీన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. స్థానికుల్లో తాము బెంగాల్‌ నుంచి వేరుపడుతున్నామన్న భావన వస్తుందని ఆ పార్టీ వాదిస్తోంది.

‘‘ఇలా ఒక రాష్ట్రం నుంచి కొంత ప్రాంతాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతం చేయడం సమాఖ్య నిర్మాణానికి విరుద్ధం. ఇది కేవలం పాలనాపరమైన మార్పు కాదు, రాష్ట్ర హక్కులపై దెబ్బ’’అంటూ జోరుగా ప్రచారం చేస్తోంది. మమత సర్కారుపై ఒత్తిడి పెంచడం, బెంగాలీల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, భద్రతాపరమైన అంశాలను తెరపైకి తేవడం వంటి ఉద్దేశాలతో బీజేపీ తొలుత ఉద్దేశపూర్వకంగానే ‘కేంద్రపాలిత ప్రాంతం’అంశాన్ని ప్రచారంలో పెట్టిందనే విశ్లేషణలు విని్పస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయమేదీ ఉండకపోయినా భద్రతాపరంగా పరిస్థితులు మారి ఉద్రిక్తతలు పెరిగితే ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నికలపై ప్రభావం..
సిలిగురి కారిడార్‌పై రాజకీయ రచ్చ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇదే అంశాన్ని తృణమూల్‌ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. గౌతమ్‌ దేవ్‌ వంటి ఆ పార్టీ నేతలు ‘కేంద్రపాలిత ప్రాంతం’అంశాన్ని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ, తేయాకు కార్మికుల మిశ్రమంగా ఉండే సిలిగురి ప్రాంతంలో కనీసం 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో ఈ ప్రచారం బాగా ప్రభావం చూపనుంది. దీనికి విరుగుడుగా స్థానిక సమస్యలు, ఉద్యోగాలు, వేతనాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను బీజేపీ నమ్ముకుంది. వాటిపైనే ముమ్మరంగా ప్రచారం చేస్తూ స్థానికులను ఆకట్టుకునే పనిలో పడింది. సిలిగురి ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తేయాకు తోట కార్మికులు, గిరిజన వర్గాలు, రాజబన్షీలలో బీజేపీ ఇప్పటికే ప్రాబల్యాన్ని పెంచుకుంది. దాంతో ఇక్కడ తిరిగి పట్టు సాధించేందుకు తృణమూల్‌ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement