ఓహో ఓహో పావురమా.. వయ్యారి పావురమా.. మావారి అందాలు నీవైన తెలుపుమా..’ అంటూ ఆనాటి సినీ కవులు పావురాన్ని రాయబారిగా పంపితే, నేడు పెద వాల్తేరు వాసులు ఆ కపోతాల సందడిని చూసి పరవశించిపోయారు. సాగర తీరపు గాలిలో స్వేచ్ఛగా విహరించే ఈ పక్షులు, పెద వాల్తేరు కూడలిని తమ ఆవాసంగా మార్చుకున్నాయి. ఇక్కడి విద్యుత్ వైర్లు వాటికి ఊయలలైతే, స్థానికులు ప్రేమతో చల్లే గింజలు పక్షులకు పంచభక్ష్య పరమాన్నాలవుతున్నాయి. కాంక్రీట్ వనంగా మారుతున్న నగరంలో వందలాది పావురాలు ఒక్కచోట చేరి చేస్తున్న సందడి చూస్తుంటే.. ఒక అద్భుతమైన పక్షుల లోకం ఇక్కడికి దిగివచ్చిందా అన్నట్లుగా ఉంది. ఈ దృశ్యం అటుగా వెళ్లే బాటసారులను సైతం ఆపి, కాసేపు ఆ పావురాల వయ్యారాలను తిలకించేలా చేస్తోంది.
–ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


