చంద్రబాబు పతనం మొదలైంది | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పతనం మొదలైంది

Mar 6 2026 8:02 AM | Updated on Mar 6 2026 8:02 AM

● లోకేష్‌ రెడ్‌బుక్‌కు భయపడే ప్రసక్తే లేదు ● నా కుటుంబానికి అండగా నిలిచిన ఉత్తరాంధ్ర నేతలకు ధన్యవాదాలు ● మాజీ మంత్రి అంబటి రాంబాబు

పెదగంట్యాడ: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం ప్రారంభమైంది. రాష్ట్రంలో పాలన అదుపు తప్పింది. అక్రమ కేసులు బనాయించి నాయకులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం దారుణం’ అని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గురువారం విశాఖ వచ్చిన ఆయన, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తనపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి, 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపించారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ కలిసి తనపై దాడి చేయించారని మండిపడ్డారు. ‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఏకధాటిగా ఏడు గంటల పాటు నా ఇంటిపై దాడి చేయించారు. పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోకపోవడం శోచనీయం. నాపై భౌతిక దాడికి దిగడమే కాకుండా.. నా కుటుంబ సభ్యులను భయ పెట్టి, నా కార్యాలయం, కార్లు, ఆస్తులను ధ్వంసం చేశారు. గుంటూరు పట్టణం నడిబొడ్డున జరిగిన ఈ దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ స్వయంగా పర్యవేక్షించారు.’ అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం అండదండలు ఉండబట్టే ఈ దాడులను ఎవరూ ఆపలేదన్నారు.

నేతలకు, కాపు సామాజికవర్గానికి

ధన్యవాదాలు

తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన సమయంలో తనకు అండగా నిలిచిన ఉత్తరాంధ్ర నేతలకు అంబటి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్యలతో పాటు కాపు సంఘాల నాయకులు తన కుటుంబానికి ధైర్యం చెప్పారన్నారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలుపుతూ.. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.

రెడ్‌ బుక్‌ను లెక్కచేయను

‘అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా నేను కానీ, నా కార్యకర్తలు కానీ భయపడే ప్రసక్తే లేదు. లోకేష్‌ రెడ్‌ బుక్‌ను నా కుక్క కూడా లెక్కచేయదు. ఇదే స్టాండ్‌ మీద మేము నిలబడతాం. కేసులు, జైళ్లకు భయపడం’ అని అంబటి స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదని, చంద్రబాబు, లోకేష్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. రాష్ట్ర ప్రజలను, పరిపాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, కాపు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement