ఏయూలో అరాచక శక్తులను అరికట్టండి | - | Sakshi
Sakshi News home page

ఏయూలో అరాచక శక్తులను అరికట్టండి

Feb 28 2026 7:07 AM | Updated on Feb 28 2026 7:07 AM

ఏయూలో అరాచక శక్తులను అరికట్టండి

ఏయూలో అరాచక శక్తులను అరికట్టండి

కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాల ధర్నా

మహారాణిపేట: ఆంధ్రా యూనివర్సిటీలో మత వైషమ్యాలు సృష్టించి, విద్యార్థులపై దాడులకు పాల్పడిన ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ, బీజేపీ శక్తులను తక్షణమే అరెస్టు చేయాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించి, ఏయూలోని విద్యార్థి, కార్మిక, దళిత సంఘాల జెండాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ధర్నాను ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. రెహ్మన్‌, సీపీఐఎంఎల్‌ (న్యూ డెమోక్రసీ) కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, ప్రజాపోరు కార్యదర్శి మహిత మాట్లాడారు. విద్యపై ఏకాగ్రత వహించాల్సిన విశ్వవిద్యాలయంలో మత విద్వేషాలు రగిల్చి, విద్యార్థినిపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులతో నీచమైన ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఏయూ ఎప్పుడూ మత సామరస్యానికి, విద్యా వికాసానికి నిలయమని, అటువంటి చోట అరాచకాలు సృష్టించడం దారుణమని ధ్వజమెత్తారు. అధికార గర్వంతో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న దుండగులపై పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని వారు ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టాలు వీరికి వర్తించవా? చంద్రబాబు ప్రభుత్వం వీరికి మినహాయింపు ఇచ్చిందా? అని నిలదీశారు. నిందితులను అరెస్టు చేయకపోతే ప్రభుత్వం అరాచకాలను ప్రోత్సహిస్తుందనే భావన ప్రజల్లో కలుగుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఏయూలో ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించాలని నేతలు డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు బి.గంగారావు, ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, పి.మణి, వి.కృష్ణారావు, పి.పైడిరాజు, బి.రమణి, క్షేత్రపాల్‌, వనజ, చంద్రశేఖర్‌; సీపీఐఎంఎల్‌ (న్యూ డెమోక్రసీ) నాయకులు నిర్మల, వెంకటలక్ష్మి తదితరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement