అనంతుని పెళ్లి సందడి | - | Sakshi
Sakshi News home page

అనంతుని పెళ్లి సందడి

Feb 26 2026 9:18 AM | Updated on Feb 26 2026 9:18 AM

అనంతు

అనంతుని పెళ్లి సందడి

నేటి నుంచి కల్యాణోత్సవాలకు అంకురార్పణ

మాధవుని ఇంట

పద్మనాభం : ఆధ్యాత్మిక వైభవానికి ప్రసిద్ధి చెందిన పద్మనాభం క్షేత్రంలో పెళ్లి సందడి నెలకొంది. దేశంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాలు కేవలం రెండుచోట్లే ఉన్నాయి. ఒకటి కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం కాగా, మరొకటి ఆంధ్రప్రదేశ్‌లోని పద్మనాభం గ్రామ గిరిపై వెలసిన ఈ ప్రాచీన క్షేత్రం. ఈ ఆలయానికి అనుబంధంగా గిరి దిగువన ఉన్న శ్రీ కుంతీ మాధవ స్వామి ఆలయంలో గురువారం నుంచి అనంతుని కల్యాణోత్సవాలు జరగనున్నాయి.

అంకురార్పణతో ఆరంభం

ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అనంత పద్మనాభ స్వామి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ 23న గాలి గోపురం వద్ద పెళ్లి రాట వేశారు. 26వ తేదీ రాత్రి పుట్టబంగారంతో కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. చక్రపెరుమాళ్లను పల్లకీలో ఊరేగింపుగా పాతసంత స్థలానికి తీసుకెళ్లి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం భూమాతకు ప్రత్యేక పూజలు చేసి, తీసుకొచ్చిన పవిత్ర మట్టిని 12 పాళికల్లో నింపి నవధాన్యాలు వేసే కార్యక్రమం నిర్వహిస్తారు.

27న కల్యాణ మహోత్సవం

ప్రధాన ఘట్టమైన అనంత పద్మనాభ స్వామి కల్యాణం 27వ తేదీ రాత్రి వైభవంగా జరుగుతుంది. ఆలయం వద్ద ధ్వజపటం ఎగురవేసి, అనంత పద్మనాభ స్వామిని ఆంజనేయస్వామి వాహనంపై, శ్రీదేవి–భూదేవులను హంసవాహనంపై, గోదాదేవిని గజవాహనంపై రాజవీధిలోకి తీసుకువచ్చి ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహిస్తారు. పెళ్లికొడుకు తరఫువారు, పెళ్లికూతురు తరఫువారిని కట్న కానుకల గురించి అడిగే హాస్య గట్టాలు భక్తులను అలరిస్తాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, నాదస్వరాల నడుమ ప్రత్యేకంగా రూపొందించిన కల్యాణ వేదికపై స్వామివారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. 28న గ్రామబలిహరణం, గ్రామోత్సవం జరుగుతాయి.

తెప్పోత్సవం– దివ్య విహారం

వచ్చే నెల 1వ తేదీ రాత్రి తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాలను హంసవాహనంపై తీసుకువచ్చి పుష్కరిణి గట్టు వద్ద విశేష పూజలు నిర్వహించి, అనంతరం పుష్కరిణిలో ఉభయదేవీరులతో స్వామివారు విహరిస్తారు. నీటిమీద తేలియాడే తెప్పపై స్వామివారి దర్శనం భక్తులకు అపూర్వానుభూతిని కలిగిస్తుంది.

డోలోత్సవం, పుష్పయాగంతో ముగింపు

3వ తేదీ ఉదయం స్వామివారు డోలా మండపానికి చేరుకుని ఉయ్యాల సేవను అనుగ్రహిస్తారు. 4వ తేదీ రాత్రి పుష్పయాగంతో కల్యాణోత్సవాలు మహోత్సాహంగా ముగుస్తాయి.

ఉత్సవాల ఏర్పాట్లు

కల్యాణానికి నూతన వస్త్రాలు సిద్ధం చేశారు. ఆలయం ముందు భారీ తాటాకుల పందిరి వేశారు. తెప్పోత్సవం కోసం పుష్కరిణిని నీటితో నింపుతూ కొత్త తెప్పను తయారు చేశారు. రథోత్సవంలో రథం వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన కర్రదుంగలను సిద్ధం చేశారు.

2న రథోత్సవం

2వ తేదీ రాత్రి రథోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. వైదిక సైదస్యం, విశేష హోమం, మంగళాశాసనం నిర్వహిస్తారు. రాత్రి 11 గంటలకు గాలి గోపురం వద్ద నుంచి రథోత్సవం ప్రారంభమవుతుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రథం ముందు అన్నంతో కుంభం పోయడం ప్రత్యేక సంప్రదాయం. కృష్ణాపురానికి చెందిన మొకర, సుంకర, గాడు, కనకల అర్చకునిపాలేనికి చెందిన తాలాడ, ఇసకలపాలేనికి చెందిన కనకల వారి కుటుంబ సభ్యులతో పాటు అశేష భక్త జనులు రథాన్ని లాగుతారు. స్వామివారి రథచక్రాలు ముందుకు సాగుతుండగా భక్తి పారవశ్యంలో మునుగుతేలుతారు.

4వ తేదీన

పుష్పయాగంతో

ఉత్సవాల

ముగింపు

అనంతుని పెళ్లి సందడి 1
1/2

అనంతుని పెళ్లి సందడి

అనంతుని పెళ్లి సందడి 2
2/2

అనంతుని పెళ్లి సందడి

Advertisement
 
Advertisement
Advertisement