మహారాణిపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు 20 రోజుల పాటు మహిళలు, బాలికల సాధికారతకు సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవం నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళల హక్కుల పరిరక్షణ, ఆర్థిక సాధికారత, ఆరోగ్య అవగాహన, సైబర్ భద్రత, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు, న్యాయ సహాయం, గృహ హింస నివారణ వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళల సాధికారతకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, విద్యాసంస్థలు, యువజన సంఘాలు, ప్రజలు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేసీ జి.విద్యాధరి, డీఆర్‌వో సత్తిబాబు, జిల్లా సీ్త్రశిశు సంక్షేమ అధికారిణి కె.వి.రామలక్ష్మి పాల్గొన్నారు.


