నూనెంతో భారం | - | Sakshi
Sakshi News home page

నూనెంతో భారం

Feb 27 2026 4:07 AM | Updated on Feb 27 2026 4:07 AM

నూనెం

నూనెంతో భారం

● భారీగా పెరిగిన వంటనూనెల ధరలు ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ● సామాన్యులు విలవిల ● పర్యవేక్షణ ఏదీ!

మహారాణిపేట: నిత్యం ఏదో ఒక కూరతో కడుపు నింపుకుందామనుకునే సగటు జీవికి వంటనూనె ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు కాస్త భారంగా ఉన్న ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపు చేస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఏడాది కాలంలోనే నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో బతుకు బండిని లాగడం భారంగా మారింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 12 శాతం పన్ను పోటుకు తోడు, వ్యాపారుల స్వయంకృత మాయాజాలం తోడవడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. సామాన్యుల గోడు పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహిస్తుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారుల కృత్రిమ కొరత

ధరల పెరుగుదల వెనుక కేవలం పన్నులే కాకుండా, వ్యాపారుల అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కొందరు బడా వ్యాపారులు సరుకులను బ్లాక్‌ చేసి మార్కెట్‌లో డిమాండ్‌ను సృష్టించి, ఇష్టానుసారంగా ధరలను పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. గత నెలలో కిలో రూ. 90 నుంచి రూ. 160 మధ్య ఉన్న నూనె ధరలు, ప్రస్తుతం రకాన్ని బట్టి రూ. 115 నుంచి రూ. 210 వరకు పలుకుతున్నాయి. పామాయిల్‌ దగ్గర నుంచి వేరుశెనగ నూనె వరకు ప్రతి లీటరుపై రూ. 20 నుంచి రూ. 60 వరకు పెరగడం సామాన్యుడిని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ధరల పెరుగుదలే కాకుండా, కొన్ని కంపెనీలు పరిమాణంలోనూ మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. లీటర్‌ ప్యాకెట్‌ అని నమ్మి కొనే వినియోగదారుడికి కేవలం 800 లేదా 850 గ్రాముల నూనెను మాత్రమే ఇచ్చి నిలువునా వంచిస్తున్నాయి.

నిమ్మకు నీరెత్తనట్టు అధికార యంత్రాంగం

ఈ దోపిడీని అరికట్టాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ధరల నియంత్రణ కమిటీ సమావేశాలు కేవలం ఫొటోలకే పరిమితమవుతున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో తనిఖీలు, దాడులు కరువయ్యాయి. పండగలు వస్తే చాలు నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టించే ముఠాలపై చర్యలు తీసుకునే నాథుడే లేడు. బహిరంగ మార్కెట్‌లో ఎవరికి నచ్చిన ధరలకు వారు విక్రయిస్తున్నా పర్యవేక్షణ శూన్యం. రబీ పంట చేతికి వచ్చే వరకు ఈ ధరల సెగ తప్పదని వ్యాపార వర్గాలు చెబుతుండటంతో, సామాన్యుడి వంటింట్లో నూనె వేయకుండానే మంటలు రేగుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని అక్రమ నిల్వదారులపై ఉక్కుపాదం మోపి, ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ధరల సెగతో

బతుకు భారమైంది

హిరంగ మార్కెట్లో వంటనూనెల ధరలు చూస్తుంటే భయం వేస్తోంది. గతంలో తక్కువ ధరలకే దొరికేవి, కానీ ఇప్పుడు ఆమాంతం పెరిగిపోయాయి. నా భర్త కూలీ పనుల మీద వచ్చే ఆదాయంతో నలుగురు సభ్యులున్న మా కుటుంబాన్ని నెట్టుకురావడం చాలా కష్టమవుతోంది. నెలకు కనీసం రెండు కిలోల నూనె అవసరమవుతుంది, కానీ ఈ భారంతో వాడకం తగ్గించక తప్పడం లేదు. మాలాంటి పేద కుటుంబాలకు నూనెతో పాటు నిత్యావసరాలు కొనడం తలకు మించిన భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించి మమ్మల్ని ఆదుకోవాలి.

– అవ్వా దేవి, చాకలివీధి,

27వ వార్డు, జీవీఎంసీ

నూనెంతో భారం1
1/1

నూనెంతో భారం

Advertisement
 
Advertisement
Advertisement