ఆయేషా మీరా కేసులో దర్యాప్తు సంస్థల వైఫల్యం | - | Sakshi
Sakshi News home page

ఆయేషా మీరా కేసులో దర్యాప్తు సంస్థల వైఫల్యం

Mar 2 2026 7:17 AM | Updated on Mar 2 2026 7:17 AM

ఆయేషా మీరా కేసులో దర్యాప్తు సంస్థల వైఫల్యం

ఆయేషా మీరా కేసులో దర్యాప్తు సంస్థల వైఫల్యం

బీచ్‌రోడ్డు: ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో ఆధారాలను నిర్వీర్యం చేసిన దర్యాప్తు సంస్థలు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్చి 8న ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం’ సందర్భంగా రూపొందించిన ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎం. లక్ష్మి మాట్లాడుతూ.. రాజ్యాంగం ముందు అందరూ సమానమేనని చెబుతున్నా ఆయేషా మీరా , నటి ప్రత్యూష వంటి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అధికారానికి, డబ్బుకు లొంగిపోయాయని దుయ్యబట్టారు. ఆధారాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లా కమిషన్లు, గత తీర్పులు చెబుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హత్య జరిగిన 12 ఏళ్ల తర్వాత సమాధి తవ్వి, ఆధారాలు దొరకలేదనే సాకుతో హైకోర్టు కేసును మూసివేయడం సరికాదన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్‌. వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఉదయం 10 గంటలకు నగరంలోని ఎల్‌ఐసీ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి జీవీఎంసీ వరకు భారీ ర్యాలీ, అనంతరం సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే మార్చి 7న పెందుర్తి అంబేడ్కర్‌ కాలనీలో సభ ఉంటుందని పేర్కొన్నారు. శ్రామిక మహిళల ఉపాధిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి డి. రోహిణి దేవి, కార్యవర్గ సభ్యులు జయ, నాగమణి, బాలనాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

విచారణ సంస్థలపై చర్యలు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement