ఆరిలోవ: నగరంలోని బీఆర్‌టీఎస్ మార్గంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆరిలోవ ట్రాఫిక్ ఎస్.ఐ ధర్మేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్‌కు చెందిన ఆర్. సాయికిరణ్ (23) తన ద్విచక్ర వాహనంపై అడవివరం నుంచి హనుమంతవాక వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం సాయికిరణ్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికిరణ్ తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


