పెదగంట్యాడ: పెదగంట్యాడ మండలంలోని వుడా కాలనీ డబుల్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి నిలిపి ఉంచిన ఓ ప్రైవేటు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. న్యూపోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైత్ర ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన బస్సు ఐటీ పార్కు ఉద్యోగుల రవాణా కోసం అద్దెకు నడుస్తోంది. యథావిధిగా శనివారం సాయంత్రం అపోలో ఫార్మసీ సమీపంలో బస్సును పార్కింగ్ చేయగా.. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో పెదగంట్యాడ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు సగానికి పైగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బస్సు యజమాని బొడ్డేపల్లి శ్రీనివాస్ కుమార్ ఫిర్యాదు మేరకు న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


