డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 103 వినతులు అందాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్.ఎస్. వర్మలతో కలిసి బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. అందిన వినతుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానికి 51, ఇంజినీరింగ్ సెక్షన్‌కు 19, రెవెన్యూ విభాగానికి 16 వచ్చాయి. వీటితో పాటు ప్రజారోగ్యం, అడ్మినిస్ట్రేషన్, యూసీడీ విభాగాలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలపై అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి. నల్లనయ్య, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


