కూర్మన్నపాలెం: జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని మంగళపాలెం టిడ్కో గృహ సముదాయంలో సోమవారం ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని ఒడిశా రాష్ట్రం కందమాల్ జిల్లా నారాయణపురకు చెందిన అభినాష్ ప్రధాన్ (21)గా పోలీసులు గుర్తించారు. అభినాష్ ప్రధాన్ తన స్నేహితులతో కలిసి వారం రోజుల క్రితమే ప్లంబింగ్ పనుల కోసం మంగళపాలెం వచ్చాడు. ఆదివారం పనికి సెలవు కావడంతో ఆయన సమీపంలోని టిడ్కో ఇళ్ల వైపు వెళ్లాడు. ఆ సమయంలో పైపుల శబ్దం రావడంతో స్థానికులు ‘దొంగలు.. దొంగలు’ అంటూ కేకలు వేశారు. దీంతో భయాందోళనకు గురైన అభినాష్, అందరిలోనూ దొంగగా ముద్ర పడతాననే అవమాన భారంతో అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఖాళీగా ఉన్న ఒక టిడ్కో ఇంట్లోకి వెళ్లి సీలింగ్ హుక్కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


