ఎసరు!
దేవుని భూమికి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
ఒకవైపు అధికార పార్టీ నేతలు ప్రైవేటు భూమిని కూడా వివాదాలు రేపి తమ సొంతం చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తుండగా.. మరోవైపు దేవదాయ శాఖ భూములపైనే కన్నేయడం కలకలం రేపుతోంది. దేవదాయ శాఖకు చెందిన భూమిని ’ఇనాం’ భూమిగా చూపుతూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్ట ప్రకారం దేవదాయ కమిషనర్ పరిధిలోని అంశాల్లో కలెక్టర్ జోక్యం చేసుకోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రికార్డుల్లో స్పష్టంగా దేవదాయ భూమి అని ఉన్నా, నిషేధిత జాబితా (22–ఏ)లో ఉన్న స్థలానికి కొత్త రికార్డులు ఎలా సృష్టించారో తేలాల్సి ఉంది. ఈ భూ దందా వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు అధికారుల పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
కమిషనర్‌ను కాదని కలెక్టర్ పేరుతో..?
సాధారణంగా దేవదాయశాఖకు చెందిన భూముల జాబితాను దేవదాయశాఖ కమిషనర్ అధికారికంగా ప్రకటిస్తారు. ఆయా జిల్లాల వారీగా ఆ జాబితాను కలెక్టర్లకు పంపించి, సంబంధిత సర్వే నంబర్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చుతారు. తద్వారా ఆ భూములపై ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా రక్షణ కల్పిస్తారు. అయితే అనకాపల్లిలోని సర్వే నంబరు 1539/5లో ఉన్న 2.49 ఎకరాల భూమి విషయంలో ఈ విధానానికి భిన్నంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రికార్డుల ప్రకారం ఇది దేవాదయశాఖ భూమి. అందుకే 22ఏ–1(సి) నిషేధిత జాబితాలో చేర్చారు. ఒకవేళ భూమి దేవదాయశాఖకు చెందదని తేలితే, ఆ సర్వే నంబరును 22ఏ జాబితా నుంచి తొలగించే అధికారం కేవలం దేవదాయశాఖ కమిషనర్‌కే ఉంటుంది. జిల్లా కలెక్టర్‌కు ఆ అధికారం లేదు. అయినప్పటికీ, ఈ భూమిని ఇనాం భూమిగా పేర్కొంటూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో కమిషనర్ అధికారాలను ఎప్పుడు, ఎలా కలెక్టరుకు బదలాయించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వారసత్వ హక్కు పేరుతో చక్రం
వాస్తవానికి అనకాపల్లిలోని సర్వే నెంబరు 1539/5లో 2.49 ఎకరాల భూమిని కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి దూరి కామమ్మ అనే మహిళ 2005లో దత్తత ఇచ్చారు. ఇందులో 1.38 ఎకరాలను ఎన్టీఆర్ మార్కెట్ కోసం తీసుకున్నారు. మిగిలిన 1.11 ఎకరాల భూమి దేవదాయశాఖ ఆధీనంలో ఉంది. అయితే రికార్డుల్లో మాత్రం మొత్తం భూమి దేవదాయశాఖకు చెందినదిగానే ఉంది. 2016 నుంచి కూడా దేవదాయశాఖకు చెందిన భూమిగానే రికార్డుల్లో ఉంది. అంటే ఎన్టీఆర్ మార్కెట్ కోసం తీసుకున్న భూమికీ అధికార బదిలీ ప్రక్రియ జరగలేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం భూమి 22ఏ–1(సి) నిషేధిత జాబితాలోనే ఉంది. అయితే, ఈ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని పేర్కొంటూ కాండ్రేగుల చినతల్లి అనే మహిళ దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా కలెక్టర్ ఈ సర్వే నెంబరులోని భూమి ఇనాం భూమిగా పేర్కొంటూ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికారపార్టీకి చెందిన నేతల ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమ భూమిని కాపాడాలంటూ ఇప్పుడు కన్యాకాపరమేశ్వరి దేవస్థాన సభ్యులు వేడుకుంటున్నారు.
‘‘దేవుడి దానంపై దోపిడీ చేస్తే దైవశాపం తప్పదు’’ అనే సామెత గుర్తుకొచ్చేలా అనకాపల్లిలో
దేవదాయశాఖ భూమిపై జరుగుతున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. రికార్డుల్లో స్పష్టంగా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న దేవాలయ భూమిని ఇనాం భూమిగా మలిచే ప్రయత్నం, దేవదాయ శాఖ కమిషనర్ అధికారాలను పక్కనబెట్టి కలెక్టర్ స్థాయిలో ఉత్తర్వులు వెలువడటం వెనుక కనిపించని శక్తులు పనిచేశాయా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. వ్యవస్థను మేనేజ్ చేసి, రికార్డులను సృష్టించి, సాక్షాత్తూ దేవుడి ఆస్తులకే ఎసరు పెడుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనం
రేపుతోంది.
నిజానిజాలు దేవుడికెరుక?
దేవదాయశాఖ భూమి అని రికార్డుల్లో ఉన్న స్థలాన్ని ఇనాం భూమిగా ఎలా పేర్కొన్నారు? కమిషనర్ అధికారాలను పక్కనబెట్టి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడానికి కారణమెంటి? ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
నిషేధిత జాబితా భూములపై అధికార పార్టీ నేతల కన్ను
కమిషనర్‌ను కాదని.. కలెక్టర్ ద్వారా పావులు కదిపిన వైనం
సొంత భూమిని కాపాడుకోలేక బాధితులుగా మారిన దేవదాయ అధికారులు
అధికారులే బాధితులుగా పీజీఆర్‌ఎస్‌కు..
సాధారణంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదు చేస్తారు. కానీ, అనకాపల్లి జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సాక్షాత్తూ దేవదాయ శాఖ అధికారులే బాధితులుగా మారి.. తమ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారంటూ రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సర్వే నంబరు 1539/5లోని భూమి దేవదాయశాఖకు చెందినదని, అక్కడ తమ ఆధీనాన్ని సూచిస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లు వారు ఆధారాలు చూపుతున్నారు. అయినప్పటికీ రికార్డుల మార్పుల ద్వారా కలెక్టరును తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తున్నారు.
ఎసరు!


