జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
అణువణువూ పోలీసుల తనిఖీలు
అల్లిపురం: జిల్లా కోర్టుకు బుధవారం ఉదయం బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి, అలాగే జిల్లా కోర్టుకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం కోర్టు ప్రాంగణంలో ముమ్మర తనిఖీలు చేపట్టింది. టూటౌన్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు జిల్లా కోర్టుకు చేరుకుని.. కోర్టు ఆవరణ, వాహనాల పార్కింగ్ ఏరియా, కొత్త కోర్టు భవన సముదాయం, వివిధ కోర్టు హాళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఇది ఫేక్ కాల్ నిర్ధారించుకుని పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా టూటౌన్ సీఐ వి.వి.సి.ఎం.ఎర్రంనాయుడు మాట్లాడుతూ సీపీ ఆదేశాల మేరకు కోర్టులో ప్రతి చోటా స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టామని తెలిపారు. గతంలో కూడా కోర్టుకు ఇలాంటి నకిలీ బెదిరింపు కాల్స్ వచ్చాయని గుర్తుచేశారు.


