అతివేగం.. మృత్యుపాశం
సబ్బవరం–ఆరిపాక రోడ్డులో
రోడ్డు ప్రమాదం
ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టిన
ద్విచక్రవాహనం
ప్రమాదంలో యువకుడు మృతి,
ఇద్దరి పరిస్థితి విషమం
తీర్థమహోత్సవాలకు వెళ్తుండగా విషాదం
సబ్బవరం: సబ్బవరం–ఆరిపాక రోడ్డులో గాలిభీమవరం సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం రాయపుర అగ్రహారాన్ని శోకసంద్రంలో ముంచేసింది. తవ్వవానిపాలెంలో జరుగుతున్న తీర్థమహోత్సవాలకు ఆనందంగా బయలుదేరిన ముగ్గురు యువకుల ప్రయాణం క్షణాల్లోనే విషాదయాత్రగా మారింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడంతో అతని కుటుంబం బోరున విలపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి..
రాయపుర అగ్రహారానికి చెందిన సింగంపల్లి సాయి(23), పల్ల కనకరాజు, నంబారు సందీప్ ద్విచక్రవాహనంపై సబ్బవరం వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతున్న సింగంపల్లి సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న పల్ల కనకరాజు, నంబారు సందీప్ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న సీఐ జి.రామచంద్రరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. కనకరాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఢీకొన్న తీవ్రతకు రెండు వాహనాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ద్విచక్రవాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆటో సైతం తీవ్రంగా దెబ్బతిని రోడ్డు పక్కన ఒరిగిపోయింది.
మితిమీరిన వేగమే కారణమా?
మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుల వేగం, నిర్లక్ష్యం మూడు కుటుంబాల జీవితాలను తారుమారు చేశాయని గ్రామస్తులు వాపోతున్నారు. సాయి తండ్రి గోవిందరావు కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటినుంచి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సాయి.. ఇలా ఆకస్మిక మరణం చెందడంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతమైంది. కొడుకు మరణవార్త విన్న తల్లి ఆర్తనాదాలు గ్రామస్తులు కదిలించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు యువకులు త్వరగా కోలుకోవాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. మృతుడి సోదరుడు సింగంపల్లి నరేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
బుధవారం సాయంత్రం ఆరిపాక జంక్షన్ నుంచి గ్రామంలోని శ్మశానవాటిక వరకూ నిర్వహించిన సాయి అంతిమయాత్రలో వందలాదిగా యువకులు, స్నేహితులు, గ్రామస్తులు పాల్గొని అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొని సాయి మృతదేహానికి నివాళులర్పించారు.
అతివేగం.. మృత్యుపాశం
అతివేగం.. మృత్యుపాశం


