విశాఖ సిటీ: వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని స్థలాలను వేలం ద్వారా విక్రయించి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలని చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ అధికారులకు సూచించారు. సోమవారం మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్‌తో కలిసి ఆయన డివిజన్ల వారీగా పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని, పనుల పూర్తిలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి టీడీఆర్‌లు పంపిణీ చేసేలా జీవీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో సీఈ వినయ్‌కుమార్, కార్యదర్శి మురళీకృష్ణ, ఎస్‌ఈలు భవానీశంకర్, మధుసూదనరావు, కార్యనిర్వహక ఇంజినీర్లు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


