పిచ్చుకల సంరక్షణ మన బాధ్యత
తాటిచెట్లపాలెం: మన ఇంటి పిచ్చుకలను మనమే కాపాడుకుందాం అని ఏసీపీ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. 20 రోజుల పాటు సాగే పిచ్చుకల పరిరక్షణ ప్రచారాన్ని ఆదివారం ఉదయం ఆయన రైల్వేస్టేషన్ రోడ్‌లోని 150 ఏళ్ల మర్రిచెట్టు వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా పిచ్చుకల గూళ్లు, నీటి పాత్రలు, ధాన్యం కంకులు పంపిణీ చేయడంతో పాటు చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరి పంటను ఆశించే నల్లి నివారణకు ఎంతో ఉపయోగపడే పిచ్చుకలను రైతులు తమ ఇళ్లకు ఆహ్వానించేవారని తెలిపారు. అంతరించిపోతున్న ఈ పక్షి జాతిని రక్షించేందుకు జేవీ రత్నం నేతృత్వంలోని ‘గ్రీన్‌ౖక్లైమేట్’ బృందం విశేష కృషి చేస్తోందని కొనియాడారు. జేవీ రత్నం మాట్లాడుతూ.. 50 ఏళ్ల కిందట వరికి వచ్చిన నల్లి నివారణకు రసాయన క్రిమిసంహారకాలు పిచికారీ చేయడంతో ఆశించిన ఫలితం దక్కలేదని, పైగా పిచ్చుకలు అంతరించిపోవడం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఫా ట్రస్ట్ సీఈవో డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ.. మానవాళికి మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. వాటికి అవసరమైన ఆహారం, నీరు, గూడు అందుబాటులో ఉంచాలని సూచించారు. వనమాలి, సీటీజీ గ్రూపుల ప్రతినిధి సరిత, మ్యాంగో మ్యాన్ అప్పాజీ, యాక్షన్ ఎయిడ్, కర్ణాటక ప్రాజెక్ట్స్ సంస్థల ప్రతినిధులు, అనకాపల్లి హెచ్‌ఆర్‌డీఐ నుంచి కృష్ణకుమారి, గ్రీన్ కై ్లమేట్ వలంటీర్ జె.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరితోట, భూపేష్‌నగర్ వాసులకు ఉచితంగా పిచ్చుకల గూళ్లు, నీటి పాత్రలు, ధాన్యం కంకులు పంపిణీ చేశారు.


