మసకబారుతున్న ఏయూ ప్రతిష్ట
మహారాణిపేట: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీ పరువు దిగజారిపోతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగం నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్, ఉరుకూటి చందు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు చంద్రబాబు ప్రభుత్వం, ఏయూ వీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో, కావాలనే వర్సిటీ ప్రతిష్టను దిగజార్చేలా కూటమి పాలకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షుడు శ్రీవత్సవ్ ఆరోపించారు. గత 20 నెలలుగా క్యాంపస్‌లో ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల క్యాంపస్‌లో ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలను గుర్తుచేశారు. విద్యార్థుల మధ్య చిన్న చిన్న వివాదాలను నాలుగు గోడల మధ్య పరిష్కరించాల్సిన యాజమాన్యం, వీసీ.. చోద్యం చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. వివాదం ముదిరిన తర్వాత స్వయంగా పోలీస్ కమిషనర్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయాల్సి రావడం వర్సిటీ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా గీతం కాలేజీకి 54.9 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు సిద్ధపడటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి, ఏయూ ప్రతిష్టను కాపాడేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ ప్రెసిడెంట్ అంబటి శైలేష్, జిల్లా విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


