అనంతుని రథోత్సవం..
పద్మనాభం: అనంత పద్మనాభ స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం రాత్రి పద్మనాభ క్షేత్రం భక్తి సముద్రమైంది. స్వామివారి రథోత్సవం అత్యంత వైభవోపేతంగా, కనుల పండువగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన వాహిని మధ్య అనంత పద్మనాభుడు రథారూఢుడై భక్తులకు దర్శనమిచ్చారు.
శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు
రథోత్సవానికి ముందు ఆలయ ప్రాంగణంలో వైదిక సదస్యం, విశేష హోమం, గ్రామ బలిహరణం వంటి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కుంతీ మాధవ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన భారీ రథంపై స్వామివారిని అధిష్టింపజేశారు.
వడివడిగా కదిలిన రథం : గాలిగోపురం వద్ద రథానికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవం ప్రారంభమైంది. అరిష్టాలు తొలగి, ఉత్సవం నిర్విఘ్నంగా సాగాలని రథం ముందు సంప్రదాయబద్ధంగా కుంభం (అన్నం) పోశారు. భక్తుల జయజయధ్వానాలు, ’గోవిందా.. గోవిందా’ అన్న నామస్మరణలతో రాజవీధులు మార్మోగాయి. భక్తులు భారీ తాళ్లను పట్టుకుని భక్తిశ్రద్ధలతో లాగడంతో అనంత పద్మనాభుని రథ చక్రాలు వడివడిగా ముందుకు కదిలాయి.
భక్తుల వెల్లువ : ఈ వేడుకను వీక్షించేందుకు పద్మనాభం పరిసర ప్రాంతాల నుండే కాకుండా విశాఖపట్నం, విజయనగరం, సింహాచలం ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి నీరాజనాలు అర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈవో పి.ఎల్.ఎన్. రాజు పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, పోలీసులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
గోవింద నామస్మరణతో
మార్మోగిన పద్మనాభం


