ఏయూలో మతవిద్వేషాలు వద్దు
మద్దిలపాలెం: ఆంధ్రా యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అనుబంధ సంఘాల కార్యకలాపాలను తక్షణమే అరికట్టాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకుని క్యాంపస్‌లో లౌకిక విలువలు, మత సామరస్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఏయూలో చోటుచేసుకున్న దాడులు, అనైతిక చర్యలను ఖండిస్తూ ఈ నెల 27న కలెక్టరేట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి. వర్సిటీలో నెలకొన్న పరిస్థితులపై బుధవారం పిఠాపురం కాలనీలోని సీపీఎం కార్యాలయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం, తదితర వామపక్ష పార్టీల జిల్లా నేతలు మాట్లాడుతూ.. ఏయూలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కుట్రపూరితంగా మత వైషమ్యాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. వర్సిటీకి సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు బయట నుంచి క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో సెక్షన్ 30ని ఉల్లంఘించి విద్యార్థి, దళిత, కార్మిక సంఘాల జెండాలను ధ్వంసం చేయడం వారి అమానవీయ, విధ్వంసక చర్యలకు అద్దం పడుతోందన్నారు.
పోలీసులు, వీసీ తీరుపై మండిపాటు
దాడులకు పాల్పడిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పట్ల పోలీసులు, ఏయూ వీసీ ఉదాసీనంగా వ్యవహరించడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రోత్సహించేలా వారి తీరు ఉందని ఆరోపించారు. ఈ వివాదానికి రాజకీయ రంగు పులిమి కమ్యూనిస్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు బురదజల్లుతున్నారని విమర్శించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, అలాగే కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారికి క్యాంపస్‌లోకి ప్రవేశం లేకుండా యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.రెహ్మాన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) నాయకురాలు కె.నిర్మల, సీపీఐఎంఎల్ (ప్రజాపోరు) జిల్లా కార్యదర్శి డి.దేవదత్, ఎస్‌యూసీఐ జిల్లా కార్యదర్శి ఎస్.గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
27న కలెక్టరేట్ వద్ద
వామపక్షాల నిరసన


