కొమ్మాది: రుషికొండ బీచ్‌రోడ్డులో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓంకార్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు చెందిన ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని గవర్నర్ బంగ్లా ప్రాంతం నుంచి భీమిలిలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు వెళ్లేందుకు ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరింది. బస్సు పెదరుషికొండ జంక్షన్‌కు చేరుకోగానే, ఇంజన్ భాగం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడాన్ని డ్రైవర్ రాజేష్ గమనించాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన బస్సును రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగిపోయాడు. చూస్తుండగానే మంటలు భారీ స్థాయిలో వ్యాపించి బస్సు మొత్తం అంటుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రధాన కూడలి సమీపంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. పీఎంపాలెం సీఐ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని, అటుగా వాహనాలేవీ వెళ్లకుండా స్టాపర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం


