అప్పన్నకు పెళ్లి కుదిరిందోయ్‌.. | - | Sakshi
Sakshi News home page

అప్పన్నకు పెళ్లి కుదిరిందోయ్‌..

Mar 4 2026 7:17 AM | Updated on Mar 4 2026 7:17 AM

సింహగిరిపై పెళ్లిసందడి 19న ఉగాది నాడు పెళ్లిరాట 29న వార్షిక కల్యాణోత్సవం చంద్రగ్రహణం వేళ వేకువజామునే డోలోత్సవం

సింహాచలం: సింహగిరిపై వెలసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి పెళ్లిసందడి మొదలైంది. సింహగిరి నుంచి కొండదిగువకు విచ్చేసి తన సోదరి అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారు వద్దకు వెళ్లి తనకు పిల్లనివ్వమని స్వామివారు ప్రార్థించారు. తొలుత నిరాకరించిన అమ్మవారు, స్వామివారి వైభవం, భక్తజనసందోహం చూసి ఆశ్చర్యపడి చివరకు అంగీకరించారు. దీంతో ఈ నెల 19న ఉగాది రోజు పెళ్లిరాట ఉత్సవం, అలాగే 29న చైత్ర శుద్ధ ఏకాదశి నాడు వార్షిక కల్యాణోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పాల్గుణ పౌర్ణమి డోలోత్సవం వైభవం

పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి డోలోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఆనవాయితీగా అడవివరం గ్రామంలోని కొండదిగువ పుష్కరిణి కల్యాణమండపంలోని ఉద్యానవన మండపంలో ఈ ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈసారి చంద్రగ్రహణం కారణంగా వేకువజామునే డోలోత్సవం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడిచిన యాభై ఏళ్లలో ఇంత తెల్లవారుజామున డోలోత్సవం జరగలేదని దేవస్థానం వైదికులు తెలిపారు.

పల్లకీ ఊరేగింపు.. భక్తుల పరవశం

ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని శ్రీదేవి, భూదేవి సమేతంగా విశేషంగా అలంకరించి సింహగిరి నుంచి పల్లకీలో తెల్లవారుజామున 4 గంటలకు కొండదిగువకు తీసుకొచ్చారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులు, అధికారులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద హారతుల మధ్య స్వామివారిని ఆహ్వానించారు. అనంతరం పుష్కరిణి సత్రం వద్ద ఉద్యానవన మండపంలో ఏర్పాటు చేసిన డోలిపై వేంచేపచేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. అర్చకులు సమర్పించిన వసంతాలను భక్తులపై చల్లగా, స్వామికి పెళ్లికుదిరిన ఆనందంలో భక్తులు ఒకరిపై ఒకరు వసంతాలు జల్లుకుని ఆనంద డోలికల్లో మునిగిపోయారు. అనంతరం పానకం ప్రసాదంగా అందించారు.

గ్రామ తిరువీధి మహోత్సవం : అడవివరంలో తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. పెళ్లికొడుకు అలంకరణలో ఇంటిముందుకు విచ్చేసిన స్వామివారికి గ్రామస్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిని తిరిగి సింహగిరికి చేర్చారు. దేవ స్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేదపండితులు, పారాయణదారులు ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement