ఈడ్చుకెళ్లడమేనా..? | - | Sakshi
Sakshi News home page

ఈడ్చుకెళ్లడమేనా..?

Mar 4 2026 7:17 AM | Updated on Mar 4 2026 7:17 AM

అంగన్‌వాడీల

నిర్బంధకాండపై ఆగ్రహం

మండుటెండలో రాస్తారోకో,

రోడ్లపైనే బైఠాయింపు

వేతనాలు పెంచే వరకు పోరాటం ఆగదు

సాధికారత అంటే

బీచ్‌రోడ్డు: ఒకవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటూ ప్రగల్భాలు.. మరోవైపు హక్కుల కో సం పోరాడుతున్న మహిళా లోకంపై పోలీసుల బూట్ల చప్పుళ్లు.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలపై ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధకాండపై విశాఖ నగరం అట్టుడికిపోయింది. విజయవాడలో అంగన్‌వాడీల అరెస్టును నిరసిస్తూ జీవీఎంసీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు భారీ ర్యాలీ చేపట్టిన వేలాది మంది కార్యకర్తలు, లలితా జ్యువెలర్స్‌ జంక్షన్‌ వద్ద రాస్తారోకోతో హోరెత్తించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండుటెండలోనే రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హామీలు ఇచ్చి మోసం చేశారు: ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కే ఎస్‌వి కుమార్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు ఎల్‌.దేవి, కె.వెంకటలక్ష్మి, ఉప ప్రధాన కార్యదర్శి బందా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె నిర్వహించినప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని, గ్రాట్యుటీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం దారుణమని వారు మండిపడ్డారు.

తెల్లవారుజామునే మహిళల అరెస్ట్‌లుమార్చి 22న ‘చలో విజయవాడ’ పిలుపుతో శాంతియుత ధర్నా చేపట్టగా చర్చలకు పిలుస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. తెల్లవారుజామున 4.30 గంటలకు పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి మహిళలను ఈడ్చుకెళ్లి వాహనాల్లో కుక్కేశారని అన్నారు. అరెస్టు చేసిన వారిని సుమారు 100 కి.మీ దూరంలోని ఏలూరు, చిలకలూరిపేట, జంగారెడ్డిగూడెం, పిడుగురాళ్ల, గుంటూరు, మంగళగిరి తదితర పోలీస్‌ స్టేషన్లకు తరలించారని తెలిపారు. ప్రాథమిక అవసరాలకు కూడా అనుమతి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

మహిళా సాధికారత మాటల్లోనేనా?

ఒకవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారతపై ప్రకటనలు చేస్తూ, మరోవైపు మహిళలపై ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని, అంగనవాడీ యూనియన్‌తో చర్చలు ప్రారంభించాలని, గతంలో ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు.

గురజాడ విగ్రహం వద్ద మానవహారం

సుమారు రెండు గంటల పాటు పోలీసులతో వాదోపవాదాలు జరిగిన అనంతరం విజయవాడలో అరెస్టు చేసిన వారిని విడుదల చేసినట్లు సమాచారం అందడంతో ఇక్కడి ఆందోళనను విరమించారు. అనంతరం గురజాడ అప్పారావు విగ్రహం వద్ద భారీ మానవహారం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చే భవిష్యత్‌ కార్యాచరణ పిలుపును విజయవంతం చేయాలని నాయకులు కోరారు. వందలాది అంగన్‌వాడీ కార్యకర్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement