సింహాచలం/మహారాణిపేట: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సింహాచలం పుణ్యక్షేత్రంతో పాటు నగరంలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. గ్రహణ సమయంలో దర్శనాలు నిలిపివేయడంతో ఆలయాల ప్రాంగణాలు, పరిసరాలు భక్తులు లేక నిర్మానుష్యంగా మారాయి. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయాల్లో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి యథావిధిగా భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కలగనుంది.
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువై ఉన్న సింహగిరి రోజంతా భక్తులు లేక వెలవెలబోయింది. ఉదయం 8 గంటలకే ఆలయ భోగమండపం, రాజగోపురం తలుపులను అర్చకులు మూసివేశారు. దీంతో మాడ వీధి, దర్శన క్యూలు, ఘాట్ రోడ్డు, అన్నదాన భవనం తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. రాత్రి 7 గంటల తర్వాత ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, రాత్రి ఆరాధన, పవళింపు సేవ నిర్వహించారు. బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతించనున్నారు. శ్రీ సంపత్ వినాయగర్ ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం లభిస్తుందని ఆలయ ఈవో డి.వి.వి.ప్రసాదరావు తెలిపారు. బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో ఉదయం స్వర్ణపుష్పార్చన, పంచామృతాభిషేకం తదితర నిత్య పూజల అనంతరం ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత సంప్రోక్షణ చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు. రుషికొండలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. బుధవారం సంప్రోక్షణ తర్వాత యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు.
మూసివేసిన సంపత్ వినాయగర్ ఆలయం, అప్పన్న ఆలయ భోగమండపం వద్ద తలుపులు మూస్తున్న అర్చకులు


