సాక్షి, విశాఖపట్నం : నౌకల నుంచి వెలువడే ఉద్గారాలతో పాటు.. పోర్టు నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు వంద శాతం చర్యలు తీసుకుంటున్నామని విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ డా. అంగముత్తు తెలిపారు. పోర్టులోని ఈక్యూ–1 బెర్త్ వద్ద రూ.5.4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 1000 కేవీఏ సామర్థ్యం గల లోవోల్టేజ్ షోర్ పవర్ సిస్టమ్ సౌకర్యాన్ని మంగళవారం ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన రోమాస్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేశామని తెలిపారు. ‘హరిత్ సాగర్’ కార్యక్రమంలో భాగంగా పర్యావరణహిత పోర్టు కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు వీపీఏ నిరంతరం శ్రమిస్తోందన్నారు. ఇది పోర్టులో ప్రత్యామ్నాయ మారీటైమ్ పవర్(ఏఎంపీ) కార్యక్రమం దశలవారీ అమలులో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరాంజితో పాటు వీపీఏ అధికారులు, విభాగాధిపతులు పాల్గొన్నారు.


