కమనీయం...అనంతుని కల్యాణం
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీమాధవ స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి అనంత పద్మనాభ స్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. ముందుగా ధ్వజారోహణ చేసి, స్వామివారిని ఆంజనేయ వాహనంపై, అమ్మవార్లను హంస, గజ వాహనాలపై రాజవీధుల్లో ఊరేగించి ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, నాదస్వరాల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి కల్యాణాన్ని వైభవంగా జరిపారు. ఈవో పీఎల్‌ఎన్ రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కల్యాణాన్ని ఎంపీపీ కంటుబోతు రాంబాబు, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, పద్మనాభం సర్పంచ్ తాలాడ పాప, పద్మనాభం దంపతులు, కృష్ణాపురం ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతు లక్ష్మి, ఎర్నాయుడు దంపతులు, పద్మనాభం పీఏసీఎస్ అధ్యక్షుడు మొకర అప్పలనాయుడు, భక్త బృందం సభ్యులు బుగత సత్యనారాయణ, అముజూరి అప్పారావు, బోని సన్యాసినాయుడు, మొకర సన్నిబాబు, తాలాడ పైడిరాజు, బుగత రాముతో పాటు అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అనంత పద్మనాభ స్వామి కల్యాణాన్ని కనులారా వీక్షికంచారు.


