ఇంటింటికీ సౌర విద్యుత్
కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం
మహారాణిపేట: జిల్లాలో పీఎం సూర్యఘర్– ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని యుద్ధ ప్రతిపాదికన అమలు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే మూడు నెలలను ప్రత్యేక కార్యాచరణ దశగా ప్రకటించి, ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌డీఏ, యూసీడీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ ఈ పథకం కింద సౌర యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.2.10 లక్షల ఖర్చు కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.80 వేల వరకు రాయితీ ఇస్తుందన్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా పొందే సౌకర్యం ఉందని తెలిపారు. సౌర విద్యుత్‌తో కరెంటు బిల్లులు గణనీయంగా తగ్గుతాయని, పర్యావరణ పరిరక్షణతో పాటు లబ్ధిదారులకు దీర్ఘకాలిక ఆర్థిక లాభం చేకూరుతుందన్నారు. ఇప్పటికే యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వారి అనుభవాలను వీడియోల ద్వారా ప్రచారం చేసి, ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో నమ్మకం పెంచాలని కలెక్టర్ సూచించారు. జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్యాంబాబు, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, డీపీవో శ్రీనివాసరావు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.


