కొండకు ‘మృత్యు’ గండం
మంగళపాలెం కొండపై మైనింగ్ మాఫియా?
బ్లాస్టింగ్‌లతో వణికిపోతున్న సంధ్యానగర్ వాసులు
బీటలు వారుతున్న ఇళ్లు.. కాలనీవాసుల హాహాకారాలు.
అగనంపూడి: జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని మంగళపాలెం ఇప్పుడు మందుపాతరల మీద నిలబడింది. నిబంధనల ప్రకారం జనవాసాల మధ్య బ్లాస్టింగ్‌లు నిషిద్ధమైనా, ‘ఏఏ మినరల్స్’ అనే మైనింగ్ ఏజెన్సీకి అవేవీ పట్టడం లేదు. సర్వే నంబర్ 141లోని కొండను పిండి చేస్తూ, కోట్ల రూపాయల విలువైన సహజ సంపదను కొల్లగొడుతూ, వేలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోంది. అధికారుల కళ్లు గప్పి కాదు.. వారి కళ్ల ముందే, వారి అండదండలతోనే ఈ విధ్వంసం జరుగుతుండటం గమనార్హం.
అర్ధరాత్రి బాంబుల మోత
సంధ్యానగర్, గంగవరం, మంగళపాలెం, టిడ్కో గృహసముదాయం వంటి కాలనీల్లో సుమారు 25 వేల మంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలను ఆనుకుని ఉన్న కొండపై బహిరంగంగా బాంబులు పేలుస్తుండటంతో స్థానికులు నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. బ్లాస్టింగ్‌ల ధాటికి భూమి కంపిస్తూ, పక్కనే ఉన్న టిడ్కో ఇళ్లు, జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం భవనాలు బీటలు వారుతున్నాయి. కేవలం ఇళ్లే కాకుండా, కొండపై ఉన్న పురాతన ఆలయాల గోపురం, శిఖరాలు కూడా పేలుళ్ల తీవ్రతకు దెబ్బతిన్నాయి. ఏ క్షణాన ఏ రాయి వచ్చి తమ నెత్తిన పడుతుందో, ఏ ఇల్లు కూలిపోతుందోనని పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు వణికిపోతున్నారు. గాలిలో కలిసిన ధూళి వల్ల శ్వాసకోశ వ్యాధులు చుట్టుముడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఫిర్యాదు చేసినా మైనింగ్ అధికారులు పట్టించుకోకపోగా, ఏజెన్సీకి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భూకంపం అనుకుని వీధుల్లోకి పరుగులు
రెండు రోజుల క్రితం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుళ్లతో సంధ్యానగర్, గంగవరం, టిడ్కో కాలనీవాసులు భూకంపం వచ్చిందన్న భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తీరా అది క్వారీలో జరిగిన బ్లాస్టింగ్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ భయం మాత్రం వా రిని వెంటాడుతూనే ఉంది. 30 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి బాంబులు అ మ ర్చి పేలుస్తుండటంతో భూమి కంపిస్తోందని స్థానికులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు.
దోపిడీ పర్వం
నాణ్యమైన గ్రావెల్, మెటల్ లభిస్తుండటంతో వందల కొద్దీ లారీల ద్వారా ఈ సంపదను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అనుమతి పత్రాలు చూపించమంటే నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నారని కాలనీవాసులు మండిపడుతు న్నారు.
నిద్రపోతున్న యంత్రాంగం
ఒకవైపు ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ గురించి గొప్పలు చెబుతుంటే, మరోవైపు జీవీఎంసీ పరిధిలోనే కొండలు కనుమరుగైపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంలో జిల్లా యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికై నా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ప్రత్యేక చొరవ చూపి ఈ దందా ఆపాలని, మంగళపాలెం ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించి, నిబంధనలు ఉల్లంఘించిన ఏఏ మినరల్స్ వంటి సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ ఏజెన్సీ ఆగడాలు ఆపకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, ప్రాణాలకు తెగించి అయినా క్వారీ తవ్వకాలను అడ్డుకుంటామని సంధ్యానగర్ వాసులు స్పష్టం చేస్తున్నారు.
క్వారీ తవ్వకాలను నిషేధించాలి
అనుమతులు ఉన్నాయని మైనింగ్ ఏజెన్సీ బుకాయిస్తోంది. అసలు అనుమతులు ఉంటే ఎందుకు సంబంధిత పత్రాలను చూపించడం లేదు. అనధికారిక తవ్వకాలకు అధికారులు వత్తాసు పలకడం వల్లే ఈ బాంబు పేలుళ్లు, బరితెగింపులు. పక్కనే నివాసాలు ఉన్నాయనే ఆలోచన లేకుండా ఒకేమారు పెద్ద ఎత్తున బాంబులు పేల్చుతూ భయకింపితుల్ని చేస్తున్నారు. అధికారులు స్పందించి క్వారీ తవ్వకాలు నిలిపివేయాలి.
–డీవీఆర్‌ఎస్ రంగరాజు, కాలనీవాసి
అధికారుల కనుసన్నల్లోనే...
క్వారీ తవ్వకాలకు కార్యాలయం ఏర్పాటు చేసి మరీ తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులు వత్తాసు, ఏజెన్సీ నిర్వాహకుల పలుకుబడి కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. బాంబు పేలుళ్లతో పిల్లలు, వృద్ధులు భయాందోళన చెంందుతున్నారు. రాత్రివేళల్లో బాంబుల మోతతోపాటు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. బాంబుల శబ్ధానికి ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. చుట్టూ కాలనీలు ఉండగా మైనింగ్‌కు అనుమతులెలా ఇచ్చారో అర్థం కావడం లేదు.
–డీవీ పార్వతి, స్థానికురాలు
కొండకు ‘మృత్యు’ గండం
కొండకు ‘మృత్యు’ గండం
కొండకు ‘మృత్యు’ గండం
కొండకు ‘మృత్యు’ గండం
కొండకు ‘మృత్యు’ గండం


