రహదారులు.. పరుగులు | - | Sakshi
Sakshi News home page

రహదారులు.. పరుగులు

Mar 8 2026 7:17 AM | Updated on Mar 8 2026 7:17 AM

వైఎస్సార్‌సీపీ హయాంలోవ్యూహాత్మక ప్రణాళికలు

రూ.174 కోట్ల అంచనా వ్యయంతో7 ప్రత్యామ్నాయ రహదారులు

వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో ముమ్మరంగా సాగుతున్న పనులు

ఈ ఏడాది మే చివరికి పూర్తి చేయాలని లక్ష్యం

విశాఖ సిటీ: ఆంధప్రద్రేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖ సరికొత్త సొబగులు అద్దుకుంటోంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విస్తరిస్తోంది. పర్యాటక, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో మెట్రో నగరాలకు ధీటుగా దూసుకుపోతున్న సిటీ ఆఫ్‌ డెస్టినీ.. కనెక్టివిటీని కూడా మెరుగుపర్చుకుంటోంది. విశాఖను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో గత వైఎస్సార్‌సీపీ హయాంలో రూపొందించిన బృహత్తర ప్రణాళికలు.. ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతూ, నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. మహా విశాఖ నగర శివారు ప్రాంతాలను జాతీయ రహదారులకు అనుసంధానిస్తూ.. ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులు వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయి.

అభివృద్ధికి బాటలు.. ఏడు రహదారులు

సుమారు రూ.174.64 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ఏడు రహదారులు.. శీఘ్రమైన, సులభమైన రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు నగరాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్నాయి. చిప్పాడ రహదారి మినహా మిగిలిన ఆరు రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి. దీనికి రోడ్డు డిజైన్‌ ప్లాన్‌లో మార్పులు చేయాల్సి ఉంది. గంభీరం రోడ్‌–1 పనులు 66 శాతం, బోయపాలెం రోడ్డు 60 శాతం, తాళ్లవలస–నేరేళ్లవలస రోడ్డు పనులు 51.57 శాతం, శివశక్తినగర్‌ రోడ్డు 46 శాతం, అడవివరం–శొంఠ్యాం రోడ్డు 31.75 శాతం, గంభీరం రోడ్డు–2 పనులు 15 శాతం మేర పూర్తయ్యాయి. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వీఎంఆర్డీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

భోగాపురం అందుబాటులోకి వచ్చేలోగా..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేలోగా ఈ రహదారుల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటికే నాలుగు రోడ్ల నిర్మాణాలు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. కొన్ని చోట్ల టీడీఆర్‌ ఇబ్బందులు ఉండడంతో వాటిపై దృష్టి పెట్టాం. త్వరలోనే అన్ని అడ్డంకులు తొలగి, నిర్ణీత సమయంలో రహదారులను అందుబాటులోకి తీసుకువస్తాం.

– ఎన్‌.తేజ్‌భరత్‌, మెట్రోపాలిటన్‌ కమిషనర్‌

శివశక్తినగర్‌ రోడ్‌

శివశక్తి నగర్‌ నుంచి హరిత ప్రాజెక్ట్‌ వరకు 1.67 కి.మీ మేర ఈ రోడ్డును 80/60/40 అడుగుల వేర్వేరు వెడల్పులతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి పనులు ప్రస్తుతం 46 శాతం పురోగతిలో ఉన్నాయి. మూడు ప్రాతాల్లో భూసేకరణ సమస్యలు ఉన్నాయి. వీఎంఆర్‌డీఏ అధికారులు వాటిపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది మే 15 నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement